పెద్దపల్లి, జులై 14
పెద్దపల్లి జిల్లాలో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం మోపుతోంది. మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ సతీష్, కాంట్రాక్టర్ నుండి రూ. 2 లక్షల లంచం అందుకుంటుండగా మంగళవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటనతో మున్సిపల్ కార్యాలయంలో కలకలం రేగింది.
పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సంచలన దాడి నిర్వహించారు. పెద్దపల్లి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) సతీష్, కాంట్రాక్టర్ బత్తుల శ్రీను నుండి రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా మంగళవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
మున్సిపల్ పరిధిలో జరిగిన పనులకు సంబంధించిన బిల్లులను విడుదల చేసేందుకు సతీష్, కాంట్రాక్టర్ శ్రీను వద్ద రూ. 2 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు తీసుకుంటున్న సమయంలోనే ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ఈ దాడుల్లో కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా సతీష్‌ను ఆయన ఇంటి వద్ద పట్టుకున్న అధికారులు, అనంతరం విచారణ నిమిత్తం మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. అక్కడ రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు.
ఈ ఘటనతో పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో కలకలం రేగింది. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ ఘటన మరోసారి రుజువు చేసిందని అధికారులు పేర్కొన్నారు.












