నటి, దర్శకురాలు రేణు దేశాయ్ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని, పవన్ కల్యాణ్ సినిమాల కోసం దుస్తుల ఎంపికపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సుమారు 26 ఏళ్ల క్రితం లండన్‌లో పవన్ కల్యాణ్ కోసం షాపింగ్ చేసిన అనుభవాలను ఆమె గుర్తుచేసుకున్నారు. అదే సమయంలో బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్, షారుఖ్ ఖాన్ కోసం షాపింగ్ చేసేవారని తెలిపారు.
లండన్‌లోని ప్రముఖ షాపింగ్ మాల్ సెల్ఫ్రిడ్జెస్లో తాను తరచూ దుస్తులు కొనుగోలు చేసేదాన్నని రేణు దేశాయ్ తెలిపారు. అక్కడ తనకు బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ తరచూ ఎదురయ్యేవారని చెప్పారు. తాను పవన్ కల్యాణ్ కోసం దుస్తులు ఎంపిక చేస్తుంటే.. కరణ్ జోహార్ మాత్రం బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కోసం బట్టలు కొనుగోలు చేసేవారని వెల్లడించారు. కరణ్ జోహార్ స్వయంగా కాస్ట్యూమ్ డిజైనర్ కాకపోయినా, షారుఖ్ ఖాన్‌పై ఉన్న అభిమానంతో ఆయనకు దుస్తులు ఎంపిక చేసేవారని వివరించారు. ఒకే షాపింగ్ మాల్లో ఇద్దరు ప్రముఖ నటుల కోసం తాము దుస్తులు కొనుగోలు చేయడం అప్పటి ప్రత్యేకమైన జ్ఞాపకమని పేర్కొన్నారు.
బాలు సినిమాలో ప్యాంట్ వెనుక ఆసక్తికర కథ
పవన్ కల్యాణ్ నటించిన బాలు సినిమాలో ఆయన ధరించిన ప్రత్యేకమైన కార్గో ప్యాంట్ అప్పట్లో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ ప్యాంట్ వెనుక ఉన్న కథను కూడా రేణు దేశాయ్ వివరించారు. ఈ ప్యాంట్ కోసం ఇటలీలోని మిలాన్ నగరానికి వెళ్లినట్లు తెలిపారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఉపయోగించిన అసలైన సైనిక దుస్తుల వస్త్రంతో ఆ ప్యాంట్లను తయారు చేశారని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా అలాంటి ప్యాంట్లు కేవలం ఐదు మాత్రమే తయారయ్యాయని తెలిపారు. వాటిలో ఒకదాన్ని ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెక్‌హామ్ కొనుగోలు చేయగా, మరొకదాన్ని పవన్ కల్యాణ్ కోసం తాను తీసుకొచ్చినట్లు తెలిపారు. అప్పట్లో ఒక్కో ప్యాంట్ ధర సుమారు రూ.75 వేలు ఉండేదని తెలిపారు.
ఆ ప్యాంట్ కోసం ముందుగానే డబ్బులు చెల్లించి, కొన్ని నెలలపాటు ఎదురుచూడాల్సి వచ్చిందని రేణు దేశాయ్ గుర్తుచేసుకున్నారు. ప్యాంట్ సిద్ధమైన తర్వాత దానిని తీసుకురావడానికి ప్రత్యేకంగా మిలాన్ వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. అప్పట్లో ఇప్పటిలా అంతర్జాతీయ కొరియర్ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో స్వయంగా వెళ్లి తీసుకొచ్చినట్లు తెలిపారు.
నిర్మాతను ఒప్పించి ప్రత్యేక కాస్ట్యూమ్
సినిమాలో పవన్ కల్యాణ్ ఒకే తరహా దుస్తుల్లో కనిపించే సన్నివేశాల కోసం ప్రత్యేకమైన ప్యాంట్ అవసరమైందని రేణు దేశాయ్ తెలిపారు. సాధారణంగా పది ప్యాంట్లు కొనుగోలు చేయడం కంటే ప్రత్యేకమైన ప్యాంట్‌పై పెట్టుబడి పెట్టడం మంచిదని నిర్మాతకు వివరించినట్లు తెలిపారు. అదనంగా ఖర్చు చేసినప్పటికీ ఆ దుస్తులు సినిమాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తాయని భావించినట్లు తెలిపారు. నిజంగానే ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ ప్యాంట్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నారు.
జానీ సినిమాలో హీరోయిన్గా అనుకోకుండా..
పవన్ కల్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన జానీ సినిమా గురించి కూడా రేణు దేశాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మొదట ఆ సినిమాలో హీరోయిన్గా నటించాలని తాను అనుకోలేదని తెలిపారు. హీరోయిన్ ఎంపిక కోసం ముంబైకి వెళ్లి పలువురిని పరిశీలించినట్లు తెలిపారు. అయితే ఎంపిక చేసిన నటీమణులు పవన్ కల్యాణ్‌కు, నిర్మాత అల్లు అరవింద్‌కు నచ్చలేదని తెలిపారు.


