అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు దేశీయ రాజకీయాల్లో ఎదురుదెబ్బలు తగిలితే, విదేశాంగ విధానంలో మరింత చురుగ్గా వ్యవహరించే అవకాశం ఉందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుడు సి. రాజా మోహన్ అభిప్రాయపడ్డారు. మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు ప్రతినిధుల సభను కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తుండటంతో ట్రంప్ పాలనపై చర్చ మొదలైంది.
అయితే, కాంగ్రెస్‌లో మెజారిటీ కోల్పోయినంత మాత్రాన అధ్యక్షుడి విదేశాంగ అధికారాలు పూర్తిగా తగ్గిపోవని ఆయన విశ్లేషించారు. మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు విజయం సాధిస్తే, అమెరికాలో అధికార సమతుల్యత పునరుద్ధరణకు అవకాశం ఉంటుంది. అధ్యక్షుడి నిర్ణయాలపై కాంగ్రెస్ పర్యవేక్షణ పెరుగుతుంది. అదే సమయంలో, ట్రంప్ విదేశాంగ విధానంపై మాత్రం గణనీయమైన ప్రభావం ఉండకపోవచ్చు.
గతంలోనూ పలువురు అమెరికా అధ్యక్షులు దేశీయ రాజకీయాల్లో ప్రతిబంధకాలు ఎదురైనప్పుడు అంతర్జాతీయ దౌత్యంపై దృష్టి సారించారు. 2028లో పదవీకాలం ముగిసే వరకు ట్రంప్ అంతర్జాతీయ ఒప్పందాలు, దౌత్యపరమైన చర్చలు కొనసాగించవచ్చు. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యాతో పెద్ద ఒప్పందం కుదుర్చుకోవాలన్న ట్రంప్ ఆశయానికి అమెరికా కాంగ్రెస్, భద్రతా వ్యవస్థల్లో వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది.
రష్యా, ఇరాన్‌పై కీలక నిర్ణయాలు
మాస్కోతో సంబంధాల విషయంలో రెండు పార్టీల మద్దతు కూడగట్టడం ఆయనకు సవాలుగా మారవచ్చు. మరోవైపు, ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి త్వరగా ముగింపు పలకాలన్న అభిప్రాయం అమెరికాలోని వివిధ రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. అయితే, యుద్ధాన్ని ఏ నిబంధనలతో ముగించాలన్నదే అసలు ప్రశ్నగా మారనుంది. డెమోక్రాట్లు కాంగ్రెస్‌పై పట్టు సాధిస్తే, ట్రంప్, ఆయన కుటుంబ సభ్యుల వ్యవహారాలు, ప్రయోజనాల సంఘర్షణలు, ఇతర ఆరోపణలపై విచారణలు పెరిగే అవకాశం ఉంది.
ఇవి ట్రంప్ రాజకీయ ప్రతిష్ఠను దెబ్బతీయడంతో పాటు ప్రభుత్వ పాలనపై ఒత్తిడి పెంచవచ్చు. అయితే, అధ్యక్షుడి కార్యనిర్వాహక అధికారాలను పూర్తిగా నిర్వీర్యం చేయడం మాత్రం సాధ్యం కాకపోవచ్చు. అమెరికాలో అక్రమ వలసలను నియంత్రించాలన్న ట్రంప్ విధానానికి ప్రజల్లో కొంత మద్దతు ఉన్నప్పటికీ, వలసదారులపై అమలు చేస్తున్న చర్యల విషయంలో వ్యతిరేకత పెరుగుతోంది.
వలస విధానం, వీసాలపై ప్రభావం
ముఖ్యంగా, హెచ్1బీ వీసాల అంశం భారత్‌కు కీలకమైనది. అమెరికా సంస్థలకు విదేశీ నిపుణుల అవసరం ఉండగా, మరోవైపు విదేశీ ఉద్యోగుల రాకను వ్యతిరేకించే వర్గాల ప్రభావం పెరుగుతోంది. ఈ విషయంలో రానున్న రెండేళ్లలోనూ స్పష్టత వచ్చే అవకాశం తక్కువగా ఉందని విశ్లేషణ పేర్కొంది. డెమోక్రటిక్ పార్టీలో వామపక్ష, ప్రగతిశీల భావజాలం కలిగిన నేతల ప్రభావం పెరుగుతోంది. ముఖ్యంగా, ఇజ్రాయెల్‌కు మద్దతు, మధ్యప్రాచ్య విధానాల విషయంలో పార్టీలో విభేదాలు కనిపిస్తున్నాయి.
రిపబ్లికన్ పార్టీలోనూ ట్రంప్‌పై గతంలో ఉన్న మద్దతు కొంత తగ్గుతున్నట్లు విశ్లేషణ చెబుతోంది. 2028 అధ్యక్ష ఎన్నికల నామినేషన్ పోరు ప్రారంభమయ్యే సమయానికి ట్రంప్ రాజకీయ ప్రభావం, పార్టీ భవిష్యత్తుపై మరింత చర్చ జరిగే అవకాశం ఉంది. ట్రంప్ విధిస్తున్న దిగుమతి సుంకాలు వినియోగదారులు, వ్యాపార సంస్థలపై అదనపు భారాన్ని మోపే ప్రమాదం ఉందని రాజా మోహన్ పేర్కొన్నారు.












