జర్మనీలో యువత చేపట్టిన జెన్‌జీ నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. తొలుత ప్రశాంతంగా సాగిన ఆందోళనలు రాత్రి వేళ హింసాత్మకంగా మారాయి. పలు నగరాల్లో ఆందోళనకారులు దుకాణాల అద్దాలు ధ్వంసం చేసి వస్తువులను దోచుకున్నారు. పోలీసులపై రాళ్లు, బాటిళ్లు, బాణసంచా, పెట్రోల్ బాంబులతో దాడులకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు వాటర్ క్యానన్లు, బాష్పవాయువు ప్రయోగించారు.
ఫ్రాంక్‌ఫర్ట్‌లో దుకాణాల లూటీ
జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో పరిస్థితి తీవ్రంగా మారింది. ముసుగులు ధరించిన కొందరు ఆందోళనకారులు ప్రధాన వాణిజ్య వీధిలోని దుకాణాల అద్దాలను పగులగొట్టి వస్తువులను ఎత్తుకెళ్లారు. జైల్ షాపింగ్ వీధిలోని పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఒక తుపాకుల దుకాణాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. అక్కడి నుంచి ఆయుధాలు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వాటిలో కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు.
ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు, బాటిళ్లు, పెట్రోల్ బాంబులు విసిరారు. పరిస్థితిని అదుపు చేసేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. హెలికాప్టర్లు, సాయుధ వాహనాలు, వాటర్ క్యానన్లను వినియోగించారు.
హాంబర్గ్, బెర్లిన్, కొలోన్లోనూ హింస
ఫ్రాంక్‌ఫర్ట్‌తో పాటు హాంబర్గ్, బెర్లిన్, కొలోన్ నగరాల్లోనూ నిరసనలు హింసాత్మకంగా మారాయి. హాంబర్గ్‌లో ఆందోళనకారులు రోడ్లపై అడ్డంకులు ఏర్పాటు చేసి వాటికి నిప్పంటించారు. పోలీసులపై రాళ్లు, బాటిళ్లు, బాణసంచా విసిరారు. దీంతో పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగించి గుంపులను చెదరగొట్టారు. కొలోన్‌లో పోలీసులపై దాడులు జరగడంతో అధికారులు నిరసన ప్రదర్శనను మధ్యలోనే నిలిపివేశారు. బెర్లిన్‌లో జరిగిన మరో నిరసనలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాళ్లు, బాణసంచా విసరడంతో 27 మంది పోలీసు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. దాదాపు 60 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
54 మంది అరెస్ట్.. 100 మందికి పైగా పోలీసులకు గాయాలు
ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి 54 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు రాయిటర్స్ కథనం వెల్లడించింది. వీరి వయసు 13 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్నట్లు హెస్సే రాష్ట్ర అంతర్గత వ్యవహారాల మంత్రి రోమన్ పోసెక్ తెలిపారు. హింసకు పాల్పడిన వారి సంఖ్య 1,000 నుంచి 1,500 మధ్య ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు. ఈ ఘటనల్లో 100 మందికి పైగా పోలీసు సిబ్బంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఫ్రాంక్‌ఫర్ట్‌లో 17 దుకాణాలు ధ్వంసం కాగా, ఐదు దుకాణాల్లో చోరీలు జరిగినట్లు సమాచారం.
జర్మనీలో యువత చేపట్టిన ఈ ఉద్యమానికి ప్రధానంగా ఆరు అంశాలు కారణమయ్యాయి. పెరుగుతున్న జీవన వ్యయం, పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కొరత, విద్యారంగానికి ప్రభుత్వ నిధులు తగ్గించడం, ప్రజా సేవలపై మరిన్ని నిధులు కేటాయించాలనే డిమాండ్, వాతావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరడం, తప్పనిసరి సైనిక సేవను తిరిగి ప్రవేశపెట్టే ప్రతిపాదనలను వ్యతిరేకించడం వంటివి ప్రధాన కారణాలు. ప్రభుత్వం రక్షణ రంగానికి భారీగా నిధులు కేటాయిస్తోందని, అదే సమయంలో విద్య, ఆరోగ్యం, ప్రజా సేవలపై తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని యువత ఆరోపిస్తోంది. తమ భవిష్యత్తుపై ప్రభావం చూపే నిర్ణయాల్లో యువత అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతోంది.






