నిజామాబాద్ జిల్లాలో ప్రతిపాదిత ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో స్థానిక రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని లక్కంపల్లి ప్రత్యేక ఆర్థిక మండలి సమీపంలో పరిశ్రమ ఏర్పాటుకు స్థల పరిశీలన చేపట్టారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి, కలెక్టర్ భావేష్ మిశ్రా, ఇతర అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్‌తో పాటు పొరుగు నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం 17 వేల ఎకరాలకు పైగా ఆయిల్‌పామ్ సాగు జరుగుతోందని అధికారులు తెలిపారు. భవిష్యత్‌లో మరో 5 వేల ఎకరాలకు సాగు విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రైతులకు సమీపంలోనే ప్రాసెసింగ్ సదుపాయం అందుబాటులోకి వస్తే రవాణా సమస్యలు తగ్గడంతో పాటు పంటకు సంబంధించిన విలువ ఆధారిత కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. ప్రతిపాదిత స్థలంపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి సమర్పించాలని సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
స్థలం ఖరారైన అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయించే అంశంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయిల్‌పామ్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, వంట నూనెలతో పాటు పలు ఉత్పత్తుల తయారీలో దీనిని ఉపయోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
దేశీయంగా ఆయిల్‌పామ్ సాగును పెంచడం ద్వారా దిగుమతి చేసుకునే వంట నూనెలపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచే అవకాశం ఉంటుందని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. లక్కంపల్లి ప్రత్యేక ఆర్థిక మండలిలో రైస్ బ్రాన్ ఆయిల్, సోయా ఆధారిత పరిశ్రమలను కూడా ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు.
అదే సమయంలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటిని పొదుపుగా వినియోగించాలని, యాసంగిలో నీటి అవసరం ఎక్కువగా ఉండే వరికి ప్రత్యామ్నాయ పంటలను పరిశీలించాలని సుదర్శన్‌రెడ్డి సూచించారు.












