ఓటును కాపాడండి దేశాన్ని కాపాడండి నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న వంటి నాయకులు కూడా పాల్గొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించకుండా చూడాలని, ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును పరిరక్షించాలని పార్టీ డిమాండ్ చేస్తోంది.
ఎన్నికల సంఘం పనితీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని నాయకులు ఈ సందర్భంగా తమ నిరసనను తెలియజేశారు.
కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువల సంరక్షణ, ప్రతి ఓటరు హక్కు కాపాడాలనే డిమాండ్లతో వారు తమ గళాన్ని వినిపించారు.








