దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల మైనర్ బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, అనంతరం కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటన వాయువ్య ఢిల్లీలోని స్వరూప్ నగర్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం, బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నలుగురిలో ముగ్గురు మైనర్లు కాగా, ఒకరు మేజర్‌గా గుర్తించారు. హత్య అనంతరం మృతదేహాన్ని బహిరంగ ప్రదేశంలో వదిలివెళ్లారు. మృతదేహం తీవ్రంగా దెబ్బతిన్న స్థితిలో ఉండటంతో మృతురాలి వివరాలను గుర్తించడం కూడా కష్టమైందని పోలీసులు తెలిపారు.
టెంపోలోనే దాడి
ప్రాథమిక దర్యాప్తులో, ఘటన జరిగిన రోజు బాలిక నిందితులతో కలిసి టెంపోలో ప్రయాణించిందని, అక్కడ మద్యం సేవించిన అనంతరం లైంగిక దాడికి పాల్పడి, కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని అక్కడే వదిలివెళ్లినట్లు తెలిపారు.
నిందితుల అరెస్ట్
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడిగా శివమ్ అలియాస్ సుదామను గుర్తించగా, మిగిలిన ముగ్గురు 16, 17 ఏళ్ల మైనర్లుగా వెల్లడించారు. బాలికకు నిందితులతో ముందే పరిచయం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (), పోక్సో () చట్టాల కింద కేసులు నమోదు చేశారు. నిందితుల నుంచి రెండు కత్తులు, టెంపో, దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.











