కృత్రిమ మేధస్సు (ఏఐ) భవిష్యత్తును సురక్షితంగా తీర్చిదిద్దడానికి మూడు మార్గాలను ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ సూచించారు. అంతర్జాతీయ పర్యవేక్షణ, ప్రముఖ ఏఐ సంస్థలన్నీ ఒకే వ్యవస్థ కిందకు రావడం, లేదా ఒకే సంస్థ కంప్యూటింగ్ శక్తిని పూర్తిగా నియంత్రించడం వంటివి ఆయన ప్రస్తావించారు. వీటిలో మూడో మార్గాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
కృత్రిమ మేధస్సు (ఏఐ) అభివృద్ధి వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో ఈ సాంకేతికతను సురక్షితంగా అభివృద్ధి చేయడానికి మూడు సాధ్యమైన మార్గాలను ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ వివరించినట్లు సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం, ప్రముఖ ఏఐ పరిశోధనా సంస్థలను ఒకే వ్యవస్థ కిందకు తీసుకురావడం, లేదా ఒకే సంస్థ అపారమైన కంప్యూటింగ్ సామర్థ్యాన్ని సొంతం చేసుకుని మిగిలిన సంస్థలకు అవకాశాలు లేకుండా చేయడం వంటి మూడు పరిస్థితులను ఆయన ప్రస్తావించినట్లు ది ఇన్ఫర్మేషన్ కథనం వెల్లడించింది. వీటిలో మూడో మార్గాన్ని ఆల్ట్‌మన్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు నివేదిక పేర్కొంది.
ఏఐ కోసం అంతర్జాతీయ పర్యవేక్షణ సంస్థ
అత్యాధునిక ఏఐ వ్యవస్థల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయడం మొదటి ప్రతిపాదన. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తరహాలో ఈ వ్యవస్థ పనిచేయవచ్చు. వివిధ దేశాల్లో ఏఐ అభివృద్ధి చేస్తున్న సంస్థలు పాటించాల్సిన భద్రతా ప్రమాణాలను రూపొందించడం, వాటి అమలును పరిశీలించడం దీని ప్రధాన లక్ష్యాలుగా ఉండవచ్చు. అత్యంత శక్తివంతమైన ఏఐ నమూనాల అభివృద్ధిలో భద్రతా పరీక్షలు, తనిఖీలు, వనరుల వినియోగంపై పర్యవేక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు.
అయితే, ఈ విధానం విజయవంతం కావాలంటే అమెరికా, చైనా సహా ఏఐ రంగంలో ముందున్న దేశాల మధ్య సహకారం అవసరం. అంతర్జాతీయంగా ఒకే విధమైన నియమాలను అంగీకరించడం, వాటిని అమలు చేయడం ఈ ప్రతిపాదనలో కీలక సవాళ్లుగా నిలవనున్నాయి.
ప్రముఖ ఏఐ సంస్థలన్నీ ఒకే వ్యవస్థ కిందకు
రెండో ప్రతిపాదనను డెమిస్ ప్లాన్‌గా పేర్కొన్నట్లు నివేదిక తెలిపింది. గూగుల్ డీప్‌మైండ్ అధిపతి డెమిస్ హసాబిస్ పేరుతో సంబంధం ఉన్న ఈ ఆలోచన ప్రకారం, ప్రముఖ ఏఐ పరిశోధనా సంస్థలు ఒకే ఉమ్మడి వ్యవస్థలో కలిసి పనిచేయవచ్చు. ప్రపంచ దేశాలకు అవసరమైన అత్యాధునిక ఏఐ నమూనాలను అభివృద్ధి చేయడానికి ఈ సంస్థ ఉపయోగపడవచ్చని ప్రతిపాదనలో భావిస్తున్నారు.
అణు భౌతిక పరిశోధనల కోసం పనిచేసే వంటి అంతర్జాతీయ సహకార వ్యవస్థను దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. వేర్వేరు సంస్థలు పోటీపడే బదులు, భద్రతకు సంబంధించిన పరిశోధనలను సమన్వయంతో చేపట్టడం ఈ విధానం లక్ష్యం. అయితే, ఈ నమూనాలో సంస్థల స్వతంత్రత, దేశాల ప్రయోజనాలు, నిర్ణయాధికారం వంటి అంశాలను ఎలా సమతుల్యం చేస్తారన్నది ముఖ్యమైన ప్రశ్న.
కంప్యూటింగ్ శక్తిపై ఒకే సంస్థ ఆధిపత్యం
మూడో పరిస్థితి మాత్రం ఆందోళనకరమైనదిగా ఆల్ట్‌మన్ పేర్కొన్నట్లు కథనం వెల్లడించింది. ఒక ఏఐ సంస్థ అత్యంత శక్తివంతమైన వ్యవస్థను అభివృద్ధి చేసి, భారీ ఆర్థిక సామర్థ్యాన్ని సంపాదించుకుంటే, ఇతర సంస్థలకు అవసరమైన కంప్యూటింగ్ వనరులు అందకుండా చేయగలదనే పరిస్థితిని ఇందులో వివరించారు. ఈ ప్రతిపాదనను ఎలియెజర్ ప్లాన్‌గా పేర్కొన్నట్లు నివేదిక తెలిపింది. ఏఐ భద్రతా పరిశోధకుడు ఎలియెజర్ యుడ్కోవ్స్కీ ఆలోచనలతో దీనికి సంబంధం ఉంది.












