జీ20 కూటమిలో పోలాండ్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు భారత్ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని పోలాండ్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్స్కీ తెలిపారు. ఈ విషయంలో న్యూఢిల్లీ చూపిన చొరవకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
అమెరికాలోని అట్లాంటాలో జరుగుతున్న జీ20 విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా సికోర్స్కీ మీడియాతో మాట్లాడారు. నుంచి 23 వరకు భారత పర్యటనకు వచ్చిన పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో న న్యూఢిల్లీలో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జీ20లో పోలాండ్ శాశ్వత సభ్యత్వానికి భారత్ మద్దతు ఇస్తుందని మోదీ హామీ ఇచ్చినట్లు సికోర్స్కీ వివరించారు.
జీ20లో పోలాండ్‌ను శాశ్వత సభ్యదేశంగా చేర్చాలంటూ అమెరికా ఇప్పటికే ఒక ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చిందని సికోర్స్కీ తెలిపారు. ఈ ప్రతిపాదనకు మద్దతు కూడగట్టేందుకు వివిధ దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. భారత్‌తో పాటు ఇతర సభ్యదేశాల మద్దతు కోరుతున్నామని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షతన జరిగే సమావేశాల సమయంలోనే సభ్యత్వంపై నిర్ణయం వెలువడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే దీనిపై తుది నిర్ణయానికి నిర్దిష్ట గడువు లేదని తెలిపారు.
భారత్‌తో పోలాండ్ సంబంధాలు బలపడుతున్నాయని సికోర్స్కీ పేర్కొన్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో తనకు చాలాకాలంగా మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఇటీవల పోలాండ్ ప్రధాని టస్క్ భారత పర్యటనను అత్యంత విజయవంతమైనదిగా అభివర్ణించారు. ఆ పర్యటనలో దాదాపు 100 కంపెనీల ప్రతినిధులతో కూడిన వ్యాపార బృందం కూడా పాల్గొంది. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, పునరుత్పాదక ఇంధనం, విద్య వంటి రంగాల్లో సహకారంపై ఇరుదేశాలు చర్చించాయి.
భారత్యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు వేగవంతం కావడాన్ని కూడా సికోర్స్కీ స్వాగతించారు. ఈ ఒప్పందం త్వరలో అమల్లోకి వస్తే ఇరుపక్షాలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
జీ20లో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించిన ఘనత భారత్ అధ్యక్షతన జరిగిన 2023 సదస్సుకే దక్కుతుందని సికోర్స్కీ గుర్తుచేశారు. ప్రస్తుతం జీ20లో 19 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్ సభ్యులుగా ఉన్నాయి. పోలాండ్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించే ప్రతిపాదనపై సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం అవసరం కావడంతో ప్రక్రియకు సమయం పట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు.


