దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ విద్య, సాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారని, విద్యాభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు మరువలేనివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ విద్య, సాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారని, దేశంలో విద్యాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు తొలి విద్యా శాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు బాధ్యతలు అప్పగించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలో ఐఐటీలను ఏర్పాటు చేసి ఎంతో మంది ఇంజనీర్లుగా తయారయ్యేందుకు అబుల్ కలాం ఆజాద్ పునాది వేశారని, దేశంలో విద్యాభివృద్ధికి ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించిన ఘనత ఆయన సొంతమని ఆయన పేర్కొన్నారు.
అబుల్ కలాం గారి హయాంలోనే ఐటీఐలకు పునాది పడిందని, వాటిని ఇప్పుడు ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేసుకున్నామని తెలిపారు. నాణ్యమైన విద్యను అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఆయన అన్నారు.
సాఫ్ట్ వేర్ రంగంతో పాటు పలు విభాగాల్లో ఏఐ ()తో ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉందని, కానీ బ్లూ కాలర్ జాబ్స్ ను ఏఐతో చేయలేమని, నైపుణ్యం పెంచుకుంటే భవిష్యత్ లో బ్లూ కాలర్ ఉద్యోగ అవకాశాలకు కొదవ ఉండదని ఆయన వివరించారు.
గులాంనబీ ఆజాద్ నుంచి షబ్బీర్ అలీ వరకు కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు ఎన్నో అవకాశాలను ఇచ్చిందని, మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ అందించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదేనని ఆయన అన్నారు. మైనారిటీ రిజర్వేషన్ ను తొలగిస్తామని బీజేపీ చేవెళ్ల సభలో ప్రకటించిందని, ముందు గుజరాత్ లో తొలగించి చూపించాలని తాము సవాల్ విసిరామని తెలిపారు.
మైనారిటీల సంక్షేమం తమ బాధ్యత అని, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతమని, ఏ రాజకీయ పార్టీకి ఆ చరిత్ర లేదని ఆయన అన్నారు. పేదలకు, మైనారిటీలకు కాంగ్రెస్ ఓటు హక్కు కల్పిస్తే, బీజేపీ ఆ ఓట్లను తొలగించాలని చూస్తోందని, 12 ఏళ్లు గడిచినా బీజేపీ మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ హామీ నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు.
బీజేపీతో పోరాడే శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని, తెలంగాణ గల్లీ నుంచి వెళ్లిన కారు ఢిల్లీకి చేరగానే మోదీ కమలంగా మారిపోతోందని, కాంగ్రెస్ కు మాత్రమే బీజేపీని ఎదుర్కొనే సత్తా ఉందని ఆయన అన్నారు. మైనారిటీ స్కాలర్షిప్ లను తొలగించాలని బీజేపీకి ఏ దేవుడు చెప్పాడని, క్రీడల్లో దేశ ప్రతిష్టను పెంచిన మైనారిటీ క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం నగదు బహుమతితో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి గౌరవించిందని తెలిపారు.
అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చి గౌరవించామని, షబ్బీర్ అలీని సలహాదారులుగా నియమించామని, ప్రజా ప్రభుత్వంలో మైనారిటీలకు ఎన్నో అవకాశాలు కల్పించామని ఆయన తెలిపారు.
హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదని, అది ఒరిజినల్ సిటీ అని, సిటీని కాపాడుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఓల్డ్ సిటీలో మెట్రో పనులను వేగవంతం చేశామని, మూసీ పునరుజ్జీవంతో ఓల్డ్ సిటీకి పూర్వ వైభవం తీసుకొస్తామని, మూసీ నదీ పరీవాహకంలో నైట్ ఏకానమీని ప్రోత్సహిస్తామని ఆయన అన్నారు.

