ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్లో పాకిస్థాన్ కాంస్య పతకం సాధించింది. నిషిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో జరిగిన మూడో స్థాన పోరులో బంగ్లాదేశ్‌ను 31 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో ఆసియా క్రీడల మహిళల క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్‌కు ఇది మూడో పతకంగా నిలిచింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు చేసింది. ఓపెనర్ గుల్ ఫెరోజా 23 బంతుల్లో 31 పరుగులు చేయగా.. కెప్టెన్ ఫాతిమా సనా కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఫాతిమా 30 బంతుల్లో 45 పరుగులు చేసింది. ఇందులో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. అలియా రియాజ్ 25 పరుగులతో ఆమెకు సహకరించింది.
ఒక దశలో పాకిస్థాన్ 67 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. అయితే ఫాతిమా సనా, అలియా రియాజ్ కలిసి 43 బంతుల్లో 67 పరుగుల భాగస్వామ్యంతో జట్టును పటిష్ట స్థితికి చేర్చారు. చివరి ఐదు ఓవర్లలో పాకిస్థాన్ 55 పరుగులు సాధించి బంగ్లాదేశ్ ముందు 146 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ
146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే పాకిస్థాన్ బౌలర్లు షాక్ ఇచ్చారు. నాలుగు ఓవర్లు పూర్తయ్యేసరికి బంగ్లాదేశ్ 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఉమ్మె హానీ అద్భుత బౌలింగ్‌తో మూడు వికెట్లు పడగొట్టింది. ఆమె నాలుగు ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకుంది. ఇది ఆమె అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనగా నిలిచింది.
బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా 25 పరుగులు చేయగా.. షార్మిన్ అక్తర్ 45 బంతుల్లో అజేయంగా 46 పరుగులు చేసింది. అయినప్పటికీ మిగతా బ్యాటర్లు పాకిస్థాన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. చివరికి 20 ఓవర్లలో 7 వికెట్లకు 114 పరుగులకే పరిమితమయ్యారు. దీంతో పాకిస్థాన్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.
12 ఏళ్ల తర్వాత పతకం
ఆసియా క్రీడల మహిళల క్రికెట్లో పాకిస్థాన్ గతంలో 2010, 2014లో స్వర్ణ పతకాలు సాధించింది. 2022 ఆసియా క్రీడల్లో జరిగిన కాంస్య పతక పోరులో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. ఈసారి అదే బంగ్లాదేశ్‌ను ఓడించి కాంస్యాన్ని సొంతం చేసుకుంది.
సెమీఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడిన పాకిస్థాన్.. మూడో స్థాన పోరులో మాత్రం సమష్టి ప్రదర్శనతో పతకం దక్కించుకుంది. కెప్టెన్ ఫాతిమా సనా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ కీలక పాత్ర పోషించగా, ఉమ్మె హానీ బౌలింగ్ పాకిస్థాన్ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది.











