హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్)లో ప్రముఖ పూర్వ విద్యార్థి, ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఛైర్మన్ ప్రేమ్ వత్సాకు ఘన సత్కారం జరిగింది. పాఠశాలను సందర్శించిన ఆయనకు హెచ్‌పీఎస్ సొసైటీ ప్రతినిధులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా కొత్త జూనియర్ స్కూల్ బ్లాక్‌కు శంకుస్థాపన కూడా జరిగింది.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్)లో ప్రముఖ పూర్వ విద్యార్థి, ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఛైర్మన్ ప్రేమ్ వత్సాకు ఘన సత్కారం జరిగింది. పాఠశాలను సందర్శించిన ఆయనకు హెచ్‌పీఎస్ సొసైటీ ప్రతినిధులు సన్మానం చేశారు. ప్రేమ్ వత్సా 1965 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థి.
ఈ సందర్భంగా పాఠశాలలో కొత్త జూనియర్ స్కూల్ బ్లాక్‌కు శంకుస్థాపన నిర్వహించారు. ఈ భవనానికి ప్రేమ్ వత్సా తండ్రి ఎం.సీ. వత్సా పేరు పెట్టనున్నారు. ఎం.సీ. వత్సా 1969 నుంచి 1972 వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. దీంతో వత్సా కుటుంబానికి, పాఠశాలకు ఉన్న అనుబంధాన్ని ఈ కార్యక్రమం మరోసారి గుర్తుచేసింది.
పాఠశాలను సందర్శించిన సందర్భంగా ప్రేమ్ వత్సా విద్యార్థులతో కూడా మాట్లాడారు. కృత్రిమ మేధస్సు భవిష్యత్తులో కొత్త అవకాశాలను సృష్టించగలదని, విద్యార్థులు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకుని తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. సాంకేతిక మార్పులు మనుషుల పనితీరును మెరుగుపరచడమే కాకుండా కొత్త ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలకు దారితీయవచ్చని ఆయన పేర్కొన్నారు.
తన పాఠశాల రోజుల జ్ఞాపకాలను కూడా ప్రేమ్ వత్సా విద్యార్థులతో పంచుకున్నారు. హెచ్‌పీఎస్‌లో క్రీడలు జట్టు స్ఫూర్తి, గెలుపోటములను స్వీకరించడం, వైఫల్యాల నుంచి నేర్చుకోవడం వంటి విలువలను నేర్పాయని తెలిపారు. పాఠశాలకు తిరిగి రావడం తనకు ఎప్పుడూ ప్రత్యేకమైన అనుభూతినిస్తుందని చెప్పారు.
హెచ్‌పీఎస్ సొసైటీ అధ్యక్షుడు గుస్తి జే. నోరియా మాట్లాడుతూ, పాఠశాల నుంచి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుడిగా ప్రేమ్ వత్సా ఎదగడం తమకు గర్వకారణమని అన్నారు. కొత్త జూనియర్ స్కూల్ బ్లాక్‌కు ఎం.సీ. వత్సా పేరు పెట్టడం ద్వారా పాఠశాల చరిత్రతో పాటు భవిష్యత్ తరాల విద్యార్థులను అనుసంధానిస్తున్నామని తెలిపారు.












