అమెరికాలోని రెండో అతిపెద్ద నగరమైన లాస్ ఏంజెలెస్ మేయర్‌గా భారత సంతతికి చెందిన నిత్యా రామన్ ఎన్నికయ్యారు. ప్రస్తుత మేయర్ కరెన్ బాస్‌పై విజయం సాధించి నగర పగ్గాలు చేపట్టబోతున్న ఆమె, లాస్ ఏంజెలెస్‌కు తొలి దక్షిణాసియా సంతతి మేయర్‌గా చరిత్ర సృష్టించారు. కరెన్ బాస్ తన ఓటమిని అంగీకరించి నిత్యా రామన్‌కు అభినందనలు తెలిపారు.
అమెరికాలోని రెండో అతిపెద్ద నగరమైన లాస్ ఏంజెలెస్ మేయర్‌గా భారత సంతతికి చెందిన నిత్యా రామన్ ఎన్నికయ్యారు. ప్రస్తుత మేయర్ కరెన్ బాస్‌పై విజయం సాధించి నగర పగ్గాలు చేపట్టబోతున్న ఆమె, లాస్ ఏంజెలెస్‌కు తొలి దక్షిణాసియా సంతతి మేయర్‌గా చరిత్ర సృష్టించారు. కరెన్ బాస్ తన ఓటమిని అంగీకరించి నిత్యా రామన్‌కు అభినందనలు తెలిపారు. నగర పాలన బాధ్యతల బదిలీ సజావుగా జరిగేలా సహకరిస్తానని ప్రకటించారు.
ఎవరీ నిత్యా రామన్
నిత్యా రామన్ 1928లో కేరళలోని త్రిస్సూర్‌లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు వెంకటరామన్, సుధా. తండ్రి కెల్ట్రాన్ సంస్థలో, తల్లి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో పనిచేశారు. నిత్యకు ఆరేళ్ల వయసున్నప్పుడు కుటుంబం అమెరికాకు వెళ్లింది. అక్కడ మసాచుసెట్స్‌లోని బర్లింగ్టన్లో స్థిరపడింది. నిత్యా రామన్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సామాజిక అధ్యయనాల్లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో పట్టణ ప్రణాళికలో ఉన్నత విద్య అభ్యసించారు. చదువు పూర్తయిన తర్వాత భారత్‌కు తిరిగివచ్చి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
భారత్‌లో సామాజిక సేవతో ప్రారంభమైన ప్రయాణం
భారత్‌లో ఉన్న సమయంలో ఢిల్లీలో మురికివాడల ప్రజల సమస్యలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థలతో కలిసి నిత్యా రామన్ పనిచేశారు. 2010 కామన్వెల్త్ క్రీడల ముందు మురికివాడల తొలగింపునకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లోనూ పాల్గొన్నారు. అనంతరం చెన్నైకి వెళ్లి అదే ఏడాది ట్రాన్స్పరెంట్ చెన్నై అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. నగరంలోని పేద ప్రాంతాల్లో పారిశుద్ధ్య సదుపాయాల కొరతను గుర్తించేందుకు సమాచారాన్ని సేకరించడం, ప్రభుత్వ మరుగుదొడ్ల వివరాలను నమోదు చేయడం, బస్సు మార్గాలను గుర్తించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. పేదల నివాస ప్రాంతాల తొలగింపునకు దారితీసే విధానాలను కూడా వ్యతిరేకించారు.
అమెరికాలో రాజకీయ ప్రస్థానం
2013లో నిత్యా రామన్ తిరిగి లాస్ ఏంజెలెస్‌కు వెళ్లారు. అక్కడ నగర పరిపాలనా కార్యాలయంలో పనిచేశారు. నగరంలో నిరాశ్రయుల సమస్యపై అధ్యయనం చేసే బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో 2017లో నిరాశ్రయులకు సహాయం అందించేందుకు ఎస్ఈఎల్ఏహెచ్ నైబర్‌హుడ్ హోమ్‌లెస్ కోలిషన్ను సహస్థాపించారు. నిరాశ్రయులకు ఆశ్రయం, గృహ వసతి, అవసరమైన సేవలు అందించడంపై ఆమె ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ అనుభవమే ఆమెను రాజకీయాల వైపు నడిపించింది. 2020లో లాస్ ఏంజెలెస్ నగర కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసి అప్పటి సభ్యుడు డేవిడ్ ర్యూను ఓడించారు. 17 ఏళ్ల తర్వాత పదవిలో ఉన్న కౌన్సిల్ సభ్యుడిని ఓడించిన తొలి ప్రత్యర్థిగా గుర్తింపు పొందారు. ఆ ఎన్నికతో నగర కౌన్సిల్‌కు ఎన్నికైన తొలి దక్షిణాసియా వ్యక్తిగా, తొలి ఆసియా అమెరికన్ మహిళగా మరో ఘనత సాధించారు. 2024లో మరోసారి ఎన్నికై తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
2020 ఎన్నికల్లో నిత్యా రామన్‌కు ప్రస్తుత మేయర్ కరెన్ బాస్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయితే నగరంలో పెరుగుతున్న ఇళ్ల అద్దెలు, నిరాశ్రయుల సమస్య, అగ్నిప్రమాదాల నిర్వహణ, ప్రజలకు అందాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి ఆమెకు కలిసివచ్చింది. ప్రచారంలో నిత్యా రామన్ గృహ వసతి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం, పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. రోడ్లపై గుంతల మరమ్మతులు, వీధి దీపాల నిర్వహణ, ప్రజా సేవలను మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల ఫలితాల్లో నిత్యా రామన్ 52 శాతం ఓట్లతో ముందంజలో నిలవగా, కరెన్ బాస్‌కు 48 శాతం ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న సమయంలోనూ రామన్ ఆధిక్యం నిలిచింది. దీంతో కరెన్ బాస్ తన ఓటమిని అంగీకరించారు.











