తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా 8, 9 తేదీల్లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్2026 ఏర్పాట్లపై సమీక్షించనున్నారు.
రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో నెలకొన్న కరువు పరిస్థితులు, తాగునీటి సమస్య, భూగర్భ జలాల తగ్గుదల, రైతులకు జరిగిన పంట నష్టం వంటి అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే 365 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం నుంచి కోరిన రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం, ఉపాధి హామీ పనుల కల్పన వంటి అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కరువు పరిస్థితులపై కేంద్రంతో చర్చించేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లే అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు రానుంది. మరోవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, కొత్త అభివృద్ధి ప్రాజెక్టులు, ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ, ఉద్యోగ నియామకాలు, బడ్జెట్ కేటాయింపులపై సమీక్ష జరగనుంది. కొత్త పరిశ్రమలకు పెట్టుబడులు ఆకర్షించడం, పారిశ్రామిక ప్రాజెక్టులకు భూకేటాయింపులు వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి. ఇందిరమ్మ భీమా పథకం ప్రారంభంపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.












