విద్యార్థుల శారీరక, మానసిక భద్రతతో పాటు సైబర్ భద్రత, రహదారి భద్రత, మాదకద్రవ్యాల నివారణ, ఆరోగ్యం వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించనున్నారు. పాఠశాల స్థాయిలో సురక్షా క్లబ్లు, మండల స్థాయిలో పర్యవేక్షణ బృందాలు, జిల్లా స్థాయిలో ప్రత్యేక భద్రతా విభాగాలు ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక సెల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. పాఠశాలల్లో భద్రతా తనిఖీలు నిర్వహించడం, లోపాలను గుర్తించడం, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలను పరిశీలించడం వంటి బాధ్యతలను సంబంధిత విభాగాలు చేపడతాయి.
పోలీసు, ఆరోగ్య, విద్యాశాఖలతో పాటు మహిళా భద్రతా విభాగాల సమన్వయంతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యాసంస్థల భవనాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక పరికరాలు, ఫైర్ అలారాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, విద్యుత్ భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో తెలియజేయనున్నారు. ఈ సమగ్ర భద్రతా చర్యల ద్వారా పాఠశాలల్లో సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

