బంగాళాఖాతంలో వాతావరణ వ్యవస్థ ప్రభావంతో తెలంగాణలో రానున్న రోజుల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. రాజకీయ ప్రభంజనం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ఆరెంజ్ అలర్ట్ పరిధిలోని జిల్లాలు
భారీ నుంచి అతి భారీ వర్షాల ముప్పు ఉన్న మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్ధిపేట తదితర జిల్లాలు ఈ హెచ్చరిక పరిధిలో ఉన్నాయి.
హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనూ వర్ష సూచన
హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కూడా వర్ష సూచన కొనసాగుతోంది. నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 4050 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తాజా హెచ్చరికలు సూచిస్తున్నాయి.
గురువారం, ఆ తర్వాత కూడా హెచ్చరికలు
గురువారం కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 25, 26 తేదీల్లోనూ కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాల హెచ్చరిక కొనసాగనుంది.
ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెరువులు, వరద నీరు ప్రవహించే మార్గాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల సమయంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు, బలహీన నిర్మాణాల వద్ద ఉండకపోవడం మంచిదని హెచ్చరించారు.












