వరంగల్ జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో ఒక బాధితుడు పెట్రోల్ పోసుకుని ఆందోళనకు దిగడంతో కలకలం రేగింది. తన సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదనతో గట్ల సురేందర్ ఈ చర్యకు పాల్పడ్డారు. ఘటనతో అక్కడున్న అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు.
మండలం పోనకల్ గ్రామానికి చెందిన గట్ల సురేందర్, తన సమస్యపై అధికారులకు వినతిపత్రం సమర్పించేందుకు ప్రజావాణికి వచ్చారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదనే ఆవేదనతో ఆయన ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. విషయం గుర్తించిన వెంటనే అక్కడున్న అధికారులు జోక్యం చేసుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్, బాధితుడి సమస్యను వెంటనే పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
ప్రజావాణి వంటి కార్యక్రమాలకు వచ్చే బాధితులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని, ఎలాంటి తీవ్ర చర్యలకు పాల్పడవద్దని అధికారులు సూచించారు. ఫిర్యాదులపై సంబంధిత శాఖలు సమన్వయంతో స్పందించి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.












