ఉత్తరప్రదేశ్లోని జిల్లాలో ఒక వింత వివాహం కుటుంబంలో తీవ్ర కలకలం రేపింది. 20 ఏళ్ల నందనీ పాండే, తన కుటుంబం సోదరుడిగా భావించిన 22 ఏళ్ల శాశ్వత్ గుప్తాను వివాహం చేసుకుంది. 15 ఏళ్లుగా శాశ్వత్కు రాఖీ కడుతున్న నందనీ, అతనితో కలిసి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ప్రతీకాత్మక అంత్యక్రియలు నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే, నందనీ పాండే, శాశ్వత్ గుప్తా తమ ఇళ్ల నుంచి వెళ్లిపోయి ఓ ఆలయంలో వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న నందనీ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అనుమతి లేకుండా కుమార్తె వివాహం చేసుకోవడమే కాకుండా, ఇంటి నుంచి రూ.2 లక్షలు తీసుకెళ్లిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై వారు పోలీసులను కూడా ఆశ్రయించినట్లు నివేదికలు తెలిపాయి.
కుమార్తె తీసుకున్న ఈ నిర్ణయంతో తీవ్రంగా కలత చెందిన కుటుంబ సభ్యులు, ఆమె తమ కుటుంబానికి ఇక లేనట్లుగా భావిస్తూ ప్రతీకాత్మక అంత్యక్రియలు నిర్వహించినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.
మరోవైపు, నందనీ తన కుటుంబ సభ్యుల ఆరోపణలను ఖండించింది. శాశ్వత్తో కొంతకాలంగా ప్రేమ సంబంధం ఉందని, ఇద్దరి అంగీకారంతోనే వివాహం చేసుకున్నామని ఆమె ఒక వీడియోలో పేర్కొన్నట్లు ఎన్టీ న్యూస్ తెలిపింది. ప్రస్తుతం తాను భర్తతో సంతోషంగా ఉన్నానని, తమను వేధించవద్దని కుటుంబ సభ్యులను కోరినట్లు సమాచారం.
తన తండ్రి నుంచి శారీరకంగా, మానసికంగా వేధింపులు ఎదుర్కొన్నట్లు కూడా నందనీ ఆరోపించింది. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు వివాహం తర్వాత భర్త, అత్తమామలు వైద్యం అందిస్తున్నారని ఆమె తెలిపింది. ఇంటి నుంచి రూ.2 లక్షలు తీసుకెళ్లినట్లు కుటుంబం చేసిన ఆరోపణను కూడా ఆమె ఖండించింది.
ఈ వ్యవహారంలో ఇరు వర్గాల నుంచి భిన్నమైన వాదనలు వెలువడుతున్న నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. యువతి వివాహం విషయంలో స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయమా, కుటుంబం చేసిన ఇతర ఆరోపణల్లో వాస్తవం ఎంత అన్నది దర్యాప్తు ద్వారా స్పష్టమయ్యే అవకాశం ఉంది.












