కడప-చెన్నై జాతీయ రహదారిపై భాకరాపేట సమీపంలో ఆర్టీసీ బస్సు అతివేగంతో నడిపి పాడి పశువులను ఢీకొట్టడంతో మూడు గేదెలు మృతి చెందాయి. మరో గేదెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో రైతుకు సుమారు 4 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది.
పొద్దుటూరు నుండి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంతో నడపడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని భాకరాపేట గ్రామానికి చెందిన పాడి రైతు తుర్ర శ్రీనివాసులు తన బర్రెలను తోలుకొని వెళ్తుండగా, బస్సు (ఏపీ 040358) వాటిని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ బస్సును ఆపకుండా పరారయ్యాడని రైతు తెలిపారు. ఈ ఘటనలో మూడు గేదెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో గేదె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
తన కుటుంబం పాడి పశువులపైనే ఆధారపడి జీవిస్తోందని, ఈ ప్రమాదం వల్ల సుమారు 4 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని రైతు శ్రీనివాసులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతి చెందిన గేదెల విలువ మార్కెట్లో 4 లక్షల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తిరుపతికి వెళ్తున్న బస్సును రాజంపేట ఆర్టీసీ బస్టాండ్లో గుర్తించారు. జరిగిన సంఘటనపై మండల ఎస్సై హారిక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.











