తెలంగాణలో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యాయి. ఆదాయ, కుల, నివాస, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ నమోదు, అప్డేట్ వంటి సేవలను ఇక ఇంటి వద్దనే పొందవచ్చు. ఇందుకోసం మీ సేవా డోర్‌స్టెప్ డెలివరీ సేవను ప్రభుత్వం ప్రారంభించింది.
తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మార్గదర్శకత్వంలో, ప్రజలకు సౌకర్యవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు మీ సేవా వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. ప్రజలు ఇకపై ఆదాయ, కుల, నివాస, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ నమోదు, ఆధార్ వివరాల అప్డేట్ వంటి పలు సేవలను తమ ఇంటి వద్దనే పొందవచ్చు.
మీ సేవా కేంద్రాలు లేదా ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, క్యూలలో వేచి ఉండాల్సిన పనిలేకుండా మీ సేవా డోర్‌స్టెప్ డెలివరీ సేవ ద్వారా సేవలను పొందే అవకాశం కల్పించారు. టోల్‌ఫ్రీ నంబర్ 1100కు కాల్ చేయడం లేదా మీసేవా పౌరుల పోర్టల్ ద్వారా అభ్యర్థన నమోదు చేసుకోవడం ద్వారా ఈ సేవలను పొందవచ్చు. ఆ తర్వాత మీ సేవా ప్రతినిధి నిర్ణీత సమయంలో ఇంటికి వచ్చి అవసరమైన సేవను అందిస్తారు.
మంచి స్పందన
ఈ సేవ ప్రారంభమైన మొదటి నెలలోనే 1100 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌కు ప్రజల నుంచి 3,885 కాల్స్ వచ్చాయి. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడం, పారదర్శకమైన పాలనను అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టింది. ప్రస్తుతం ఈ డోర్‌స్టెప్ సేవలు క్యూర్ () పరిధిలోని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. బుక్ చేసుకున్న సర్వీస్‌కు వర్తించే సేవా రుసుములు చెల్లించాల్సి ఉంటుంది.
సేవలను ఎలా పొందాలి
1. టోల్‌ఫ్రీ నంబర్ 1100కు కాల్ చేయండి లేదా మీ సేవా పౌరుల పోర్టల్ ద్వారా అభ్యర్థన నమోదు చేయండి. 2. అవసరమైన ధ్రువీకరణ పత్రం లేదా ఆధార్ సేవను ఎంచుకుని, కాల్ సెంటర్ ప్రతినిధికి అవసరమైన వివరాలను అందించండి. 3. నిర్ణీత సమయంలో మీ సేవా డోర్‌స్టెప్ ప్రతినిధి మీ ఇంటికి వచ్చి అవసరమైన సేవను అందిస్తారు.
జారీ చేసినవారు
కమిషనర్, ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ (), ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ, తెలంగాణ ప్రభుత్వం.











