దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పెరుగుతున్న ముడి చమురు ధరలు, భౌగోళిక ఉద్రిక్తతలు, ఆసియా మార్కెట్లలో బలహీనతలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి కారణాలతో సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి.
ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 730 పాయింట్లు పతనమై 73,170.12 వద్ద, నిఫ్టీ 231.50 పాయింట్లు తగ్గి 22,908.95 వద్ద ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లు నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి.
బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, హిందుస్థాన్ యూనిలీవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్అండ్టీఎఫ్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు ప్రధానంగా నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేస్తున్న ముడి చమురు ధరలు మరింతగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర 2.27 శాతం పెరిగి బ్యారెల్‌కు 106.7 డాలర్లకు చేరింది. చమురు సరఫరాపై ఆందోళనలు మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి, జపాన్ నిక్కీ, షాంఘై సూచీలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. అలాగే శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత ఈక్విటీల నుంచి రూ.3,693.93 కోట్లను ఉపసంహరించుకున్నట్లు ఎక్స్ఛేంజ్ గణాంకాలు వెల్లడించాయి.
శుక్రవారం మాత్రం సెన్సెక్స్ 315.20 పాయింట్లు లాభపడి 73,895.74 వద్ద, నిఫ్టీ 77.40 పాయింట్లు పెరిగి 23,140.50 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.












