విశ్వంలోని అద్భుత దృశ్యాలను ప్రజలకు పరిచయం చేసే నాసా, తన ఆస్ట్రానమీ పిక్చర్ ఆఫ్ ది డేలో భాగంగా ఒక అరుదైన చిత్రాన్ని షేర్ చేసింది. ఈ చిత్రంలో సూర్యుడు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, ఒక విమానం ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం విశేషం.
ఈ చిత్రానికి ఛాన్స్ ట్రిపుల్ అలైన్మెంట్: ప్లేన్, స్పేస్ స్టేషన్, సన్ అని పేరు పెట్టారు. చిత్రంలో సూర్యుడి ప్రకాశవంతమైన వలయం, దానిపై నల్లటి సన్స్పాట్లు కనిపిస్తున్నాయి. బలమైన అయస్కాంత క్షేత్రాల ప్రభావంతో ఇవి ఏర్పడతాయని నాసా తెలిపింది.
అదే సమయంలో, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూడా సూర్యుడి ముందు నుంచి చిన్న నల్లటి ఆకారంలో దాటుతున్న దృశ్యం బంధించబడింది. ఫొటోగ్రాఫర్ అత్యంత ఖచ్చితమైన సమయాన్ని లెక్కించి ఈ క్షణాన్ని కెమెరాలో బంధించారు.
అనూహ్యంగా విమానం
అయితే, ఈ చిత్రంలో మరో చిన్న ఆకారం అంతరిక్ష కేంద్రం కాదు, అది ఒక విమానం. ఫొటో తీస్తున్న సమయంలో అనుకోకుండా ఆ విమానం కూడా సూర్యుడి ముందుగా ప్రయాణించడంతో ఈ అరుదైన దృశ్యం ఏర్పడింది. దీంతో సూర్యుడు, అంతరిక్ష కేంద్రం, విమానం ఒకే ఫ్రేమ్‌లో కనిపించాయి.
చెక్ రిపబ్లిక్‌లోని ప్రాసెక్ ప్రాంతం నుంచి జూన్‌లో ఈ చిత్రాన్ని తీశారు. విమానం సూర్యుడి ముందు నుంచి వెళ్లిన తీరు చిన్నపాటి గ్రహణంలా కనిపించింది. ఒకే ఫ్రేమ్‌లో మూడు విభిన్న వస్తువులు సూర్యుడి నేపథ్యంపై అద్భుతంగా నమోదయ్యాయి.
3 కోట్లలో ఒక అవకాశం
ఇలాంటి దృశ్యం సాధారణంగా కనిపించడం చాలా అరుదు. ఫొటోగ్రాఫర్ అంచనా ప్రకారం, అదే ప్రదేశం నుంచి తీసే యాదృచ్ఛిక సూర్యుడి చిత్రంలో అంతరిక్ష కేంద్రం, విమానం రెండింటి నీడలు ఒకేసారి కనిపించే అవకాశం సుమారు 3 కోట్లలో ఒకటి మాత్రమే.
అందుకే ఈ చిత్రాన్ని ఖగోళ శాస్త్ర అభిమానులు, ఫొటోగ్రఫీ ప్రియులను ఆకట్టుకునే అరుదైన దృశ్యంగా నాసా ప్రదర్శించింది. ఈ చిత్రాన్ని తీసేందుకు కేవలం అదృష్టం మాత్రమే కాకుండా అత్యంత ఖచ్చితమైన సమయ ప్రణాళిక కూడా ఉపయోగపడింది.
ఈ చిత్రానికి ఫొటోగ్రాఫర్‌గా పీటర్ హొరాలెక్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ ఓపావా క్రెడిట్ పొందాయి. నాసా ప్రకారం, రోజుకో ఖగోళ చిత్రాన్ని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో విశ్వంలోని అరుదైన దృశ్యాలను ప్రజలకు అందిస్తున్నారు.











