Bhadradhi kothagudem, 14-07-2026
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాలోని సీతమ్మసాగర్, సీతారామ ప్రాజెక్టుల సందర్శన, సమీక్ష సమావేశం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం పర్యటన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాలోని సీతమ్మసాగర్, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులను పరిశీలించడంతో పాటు నిర్వహించనున్న సమీక్ష సమావేశం నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ పనులను కలెక్టర్ పరిశీలించారు. హెలిప్యాడ్ నిర్మాణం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అవసరమైన భద్రతా ప్రమాణాలు, బారికేడింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వాహనాల పార్కింగ్, రాకపోకల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.
అనంతరం అమ్మగారిపల్లి వద్ద నిర్వహించనున్న సమీక్ష సమావేశం ప్రాంగణాన్ని కలెక్టర్ పరిశీలించారు. సమావేశ వేదిక, అధికారుల, ప్రజాప్రతినిధుల కూర్చునే ఏర్పాట్లు, మీడియా ప్రతినిధులకు అవసరమైన సౌకర్యాలు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు.
పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖలతో పాటు సంబంధిత అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి తమకు అప్పగించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన, సమీక్ష సమావేశం విజయవంతంగా నిర్వహించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట అశ్వాపురం తహసీల్దార్ సూర్యప్రకాష్, నీటిపారుదల శాఖ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.










