Bhadradhi kothagudem, ఈ నెల 18, 19 తేదీలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ నెల 18, 19 తేదీల్లో తెలంగాణ గిరిజన సమైక్య మూడవ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. గిరిజనుల సమస్యలపై చర్చించడంతో పాటు, పోడు భూములకు పట్టాలు, ఇళ్ల స్థలాలు, ట్రైకర్ రుణాలు, మౌలిక సదుపాయాలు, జీవో నెంబర్ 3 పునరుద్ధరణ, ఏజెన్సీ డీఎస్సీ వంటి డిమాండ్లను ఈ మహాసభల్లో ప్రస్తావించనున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో ఈ నెల 18, 19 తేదీల్లో తెలంగాణ గిరిజన సమైక్య మూడవ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని, ఈ మహాసభలను గిరిజన సమైక్య నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని గిరిజన సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు సోందే కుటుంబరావు పిలుపునిచ్చారు. సోమవారం అశ్వాపురం మండల గిరిజన సమైక్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు కుటుంబరావు మాట్లాడుతూ, గిరిజనులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఈ మహాసభలో చర్చించనున్నామని తెలిపారు.
రాష్ట్రంలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై, గిరిజనుల జీవనాధారమైన పోడు భూములకు పట్టాలివ్వాలని, అటవీ బంజర మిగులు భూములను పంచాలని, ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టాలు ఇవ్వాలని, అర్హులైన ప్రతి గిరిజనుడికి ట్రైకర్ రుణాలు అందించాలని, గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, విద్య, వైద్యం, విద్యుత్తు, రహదారులు, వంతెనలు, తాగునీరు, సాగునీరు సౌకర్యాలు కల్పించాలని, జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని, ఏజెన్సీ డీఎస్సీ నిర్వహించాలని తదితర డిమాండ్లతో ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
18వ తేదీన పాల్వంచ పట్టణంలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించనున్నామని, 19వ తేదీన లారీ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్, బీసీఎం రోడ్, పాల్వంచలో ప్రతినిధుల మహాసభ జరగనుందని తెలిపారు. కావున పినపాక నియోజకవర్గం నుంచి ప్రతి మండలం, గ్రామాల నుండి గిరిజనులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి గిరిజన సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, రాష్ట్ర, జిల్లా గిరిజన నాయకులు పాల్గొంటారని, కావున గిరిజనులు పెద్ద ఎత్తున హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం అశ్వాపురం మండల నూతన కమిటీ ఎన్నికలో అధ్యక్షుడిగా కల్లూరి నరసింహారావు, సహాయ కార్యదర్శిగా కంగాల నరసింహారావులను ఎన్నుకున్నారు. అనంతరం కరపత్రం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ అశ్వాపురం మండల కార్యదర్శి అనంతనేని సురేష్, మేలపురి సురేందర్ రెడ్డి, గిరిజన సమైక్య జిల్లా ఉపాధ్యక్షులు బాడిషా, సతీష్, జిల్లా కమిటీ సభ్యులు వజ్జా వెంకటేశ్వర్లు, మండల నాయకులు కనితి సత్యనారాయణ, రాయపూడి రాజేష్, గారబోయిన నరేష్, కన్నెబోయిన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










