దుమ్ముగూడెం మండలంలో ధ్వంసమైన రహదారుల పునరుద్ధరణ పనులు చేపట్టేంతవరకు ఇసుక లారీలను నిలిపివేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ మేరకు మహాధర్నా నిర్వహించారు.
భద్రాచలం–దుమ్ముగూడెం–చర్ల–వెంకటాపురం–వాజేడు ప్రధాన రహదారి ఇసుక లారీల అధిక రవాణాతో పూర్తిగా దెబ్బతిన్నదని, దీనివల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు పాడవ్వడంతో పాటు, దుమ్ముతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు.
ఇసుక ర్యాంపుల నుంచి రాకపోకలు సాగించే లారీల వల్ల జరిగిన ప్రమాదాల్లో సుమారు 40 మంది యువకులు, మహిళలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపణలు వెల్లువెత్తాయి. లారీ డ్రైవర్ల నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివి ప్రమాదాలకు కారణమవుతున్నాయని నాయకులు విమర్శించారు.
చర్ల మండలంలో 12 ఇసుక ర్యాంపులకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, ఒక్కో ర్యాంపు నుంచి రోజుకు సుమారు వెయ్యి లారీలు తిరుగుతున్నాయని, మొత్తం 12 వేల లారీలు రాత్రింబవళ్లు తిరుగుతూ రహదారులను నాశనం చేస్తున్నాయని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ పేర్కొన్నారు.
ఈ సమస్యలపై యువకులు, ఆదివాసీ సంఘాలు, వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీలు కలిసి బంద్‌కు పిలుపునిచ్చాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దుమ్ముగూడెం సెంటర్లో టెంట్ వేసి దీక్ష చేపట్టారు. మండల ఎమ్మార్వో అశోక్ కుమార్ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి, 10 రోజుల్లో రోడ్ల నిర్మాణం చేపడతామని హామీ పొందడంతో దీక్షను తాత్కాలికంగా విరమించారు. అయితే, రోడ్లు నిర్మించకుండా లారీలు తిరిగితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అఖిలపక్ష నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.









