2027లో జరగనున్న జనగణనలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. జనగణన విధుల్లో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను, విద్యా సిబ్బందిని కూడా గణకులుగా నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 1990 నాటి జనగణన నిబంధనలను సవరించింది.
దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన 2027 కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనగణన విధుల్లో పాల్గొనే సిబ్బంది పరిధిని విస్తరిస్తూ, ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, విద్యా సిబ్బందిని కూడా గణకులుగా నియమించేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 1990 నాటి జనగణన నిబంధనలను సవరించింది. ఈ సవరణకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.
కొత్త నిబంధనల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన స్థానిక సంస్థలు, ప్రభుత్వ సహాయం పొందే ప్రైవేట్ విద్యాసంస్థలు, ప్రభుత్వ సహాయం పొందని ప్రైవేట్ విద్యాసంస్థలు, సంఘాలు, ట్రస్టులకు చెందిన విద్యాసంస్థల ఉపాధ్యాయులను కూడా జనగణన విధులకు నియమించవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, ఇతర సంస్థల్లో పనిచేసే గుమాస్తాలు, అధికారులు కూడా ఈ విధుల్లో పాల్గొనే అవకాశం ఉంది.
జనగణన పనులకు తగినవారని రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు భావించే ఇతర వ్యక్తులను సైతం నియమించవచ్చు. ఈ సవరణతో జనగణన విధులకు అందుబాటులో ఉండే సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరగనుంది.
హరియాణాలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను జనగణన విధులకు నియమించడాన్ని సవాలు చేస్తూ హరియాణా ప్రోగ్రెసివ్ స్కూల్స్ కాన్ఫరెన్స్ పంజాబ్హరియాణా హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో నిబంధనల సవరణ ప్రాధాన్యం సంతరించుకుంది. న ఈ అంశానికి సంబంధించిన హరియాణా ప్రభుత్వ ఉత్తర్వుల అమలుపై హైకోర్టు మధ్యంతర నిలుపుదల విధించింది.
కరోనా మహమ్మారి కారణంగా 2021లో జరగాల్సిన జనగణన వాయిదా పడింది. ప్రస్తుతం 2027 జనగణన కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే, ఎవరిని ఏ ప్రాంతంలో నియమించాలనే విషయాన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనలు నిర్ణయిస్తాయి.











