భారతదేశంలో పక్షవాతం (స్ట్రోక్) ముప్పును తగ్గించాలంటే పొగాకు వినియోగాన్ని నియంత్రించడంతో పాటు, దానిని మానేయాలనుకునే వారికి నిరంతర వైద్య సహాయం అందించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ పక్షవాత నివారణ దినోత్సవం సందర్భంగా ఈ అంశంపై అవగాహన కల్పించారు. కేవలం ప్రచార కార్యక్రమాలకే పరిమితం కాకుండా, పొగాకు వ్యసనం నుంచి బయటపడేందుకు అవసరమైన చికిత్స, సలహాలు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు.
2024లో గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ గణాంకాల ఆధారంగా చేసిన విశ్లేషణ ప్రకారం, భారత్‌లో పక్షవాతం కారణంగా సంభవించే మరణాల్లో సుమారు 12 శాతం పొగాకు వినియోగంతో సంబంధం కలిగి ఉన్నాయి. అధిక సిస్టోలిక్ రక్తపోటు వల్ల 56 శాతం మరణాలు సంభవిస్తున్నట్లు అంచనా. దీంతో పొగాకు వినియోగాన్ని అరికట్టడంతో పాటు రక్తపోటును అదుపులో ఉంచడం కూడా పక్షవాత నివారణలో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
నికోటిన్ వ్యసనాన్ని అధిగమించేందుకు సహాయం అవసరం
నోయిడాలోని మెదాంత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చెందిన నాడీ శస్త్రచికిత్స, నాడీ సంబంధిత వైద్య విభాగాల డైరెక్టర్ డాక్టర్ యశ్పాల్ సింగ్ బుండేలా మాట్లాడుతూ.. పొగాకు మానేయాలని చెప్పడం మాత్రమే సరిపోదని, దానిని మానేందుకు అవసరమైన నిరంతర సహకారం అందించాలని అన్నారు. నికోటిన్‌కు అలవాటు పడినవారు ఆరోగ్యపరమైన ప్రమాదాలను తెలుసుకున్నప్పటికీ దానిని మానేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని వివరించారు. కౌన్సెలింగ్‌తో పాటు వైద్యపరంగా నిరూపితమైన నికోటిన్ ప్రత్యామ్నాయ చికిత్సలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం, భారత్‌లో ఏటా సుమారు 13.5 లక్షల మరణాలకు పొగాకు వినియోగం కారణమవుతోంది. సిగరెట్లు మాత్రమే కాకుండా బీడీలు, ఖైనీ, గుట్కా, జర్దా వంటి పొగలేని పొగాకు ఉత్పత్తుల వినియోగం కూడా ప్రజారోగ్యానికి సవాలుగా మారింది. అందువల్ల పొగాకు వినియోగదారుల అలవాట్లకు అనుగుణంగా వ్యసన విముక్తి కార్యక్రమాలను రూపొందించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.
యువత పొగాకుకు దూరంగా ఉండాలి
పొగాకు వినియోగాన్ని ప్రారంభించకుండా యువతను ప్రోత్సహించడం, ఇప్పటికే వినియోగిస్తున్నవారికి మానేందుకు సహాయం అందించడం ముఖ్యమని వైద్య నిపుణులు పేర్కొన్నారు. రక్తపోటు, మధుమేహం, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం వంటి అంశాలు కూడా పక్షవాతం ముప్పును పెంచుతాయని హెచ్చరించారు. ముఖ్యంగా రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం, వైద్యులు సూచించిన మందులను వాడటం, సమతుల ఆహారం తీసుకోవడం, రోజువారీ శారీరక వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వడం అవసరమని సూచించారు.
పక్షవాతం లక్షణాలను ముందుగానే గుర్తించడం కూడా అత్యంత కీలకం. ముఖం ఒకవైపు వాలిపోవడం, చేతులు లేదా కాళ్లలో అకస్మాత్తుగా బలహీనత రావడం, మాట తడబడటం, చూపులో మార్పులు లేదా సమతుల్యత కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం పొందాలి. ప్రతి నిమిషం విలువైనదే కాబట్టి లక్షణాలు తగ్గుతాయేమోనని వేచి చూడకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
పొగాకు మానేందుకు ఉచిత సహాయం
పొగాకు అలవాటును వదులుకోవాలనుకునేవారు భారత ప్రభుత్వ జాతీయ పొగాకు మాన్పించే సహాయ కేంద్రాన్ని సంప్రదించవచ్చు. 1800-112-356 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా ఉచిత సలహాలు, వ్యసన విముక్తికి సంబంధించిన మార్గదర్శకత్వం పొందవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.












