Bhadradhi kothagudem, మంగళవారం
మణుగూరు మండల పరిధిలోని సాంబాయిగూడెం గ్రామంలో సింగరేణి సేవ సమితి, వైద్య, ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ శిబిరంలో మొత్తం 114 మందికి వైద్య సేవలు అందించారు.
సింగరేణి సేవ సమితి మరియు సింగరేణి వైద్య, ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో మణుగూరు మండల పరిధిలోని సాంబాయిగూడెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో మంగళవారం సింగరేణి ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. సింగరేణి యాజమాన్యం తమ వంతు సామాజిక బాధ్యతగా బొగ్గు గనుల పరిసర ప్రాంతాల గ్రామస్తులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న క్రమంలో భాగంగా ఈ శిబిరం ఏర్పాటు చేశారు.
ఈ వైద్య శిబిరానికి స్త్రీలు, పురుషులు, వృద్ధులు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మొత్తం 114 మందికి సాధారణ వ్యాధులకు ఉచితంగా మందులు అందించారు. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులను పరీక్షించి, వారికి అవసరమైన నియంత్రణ మందులు కూడా అందజేశారు. వ్యాధుల బారిన పడకుండా గృహ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాల్సిన ఆవశ్యకతపై సింగరేణి వైద్యులు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ వివరాలను ఏజిఎం(పర్సనల్) ఎస్. రమేష్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి వైద్యులు డా. ఇన్నయ్య, స్టాఫ్ నర్స్ రూపశ్రీ, సింగరేణి సేవ సమితి కో ఆర్డినేటర్ కె. వీ. మారేశ్వర రావు, నాగమణి, రాము, సాంబాయిగూడెం గ్రామస్తులు పాల్గొన్నారు.












