సిద్దిపేట, 04.08.2026
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని శనిగరం గ్రామం అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి శిశువుకు జీవితంలోని తొలి క్షణాల నుంచే తల్లిపాలు అందేలా సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల (ఆగస్టు 1-7) సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని శనిగరం గ్రామం అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి శిశువుకు జీవితంలోని తొలి క్షణాల నుంచే తల్లిపాలు అందేలా సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువుల తల్లులు, కుటుంబ సభ్యులకు తల్లిపాల ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలను ప్రారంభించడం అత్యంత అవసరమని ఐ.సీ.డీ.ఏస్ సూపర్వైజర్ సాయి భవాని పేర్కొన్నారు. ప్రసవం అనంతరం వచ్చే ముర్రుపాలు శిశువుకు సహజసిద్ధమైన తొలి రోగనిరోధక రక్షణగా పనిచేస్తాయని, శిశువును అనేక అంటువ్యాధుల నుంచి కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆమె తెలిపారు.
తొలి ఆరు నెలల పాటు తల్లిపాలే శిశువుకు సంపూర్ణ ఆహారమని, ఈ కాలంలో నీరు లేదా ఇతర ఆహార పదార్థాలు ఇవ్వాల్సిన అవసరం లేదని సూచించారు. ఆరు నెలల తర్వాత వయస్సుకు తగిన అనుబంధ ఆహారాన్ని ప్రారంభించినప్పటికీ, రెండేళ్ల వయస్సు వరకు తల్లిపాలను కొనసాగించడం ద్వారా పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడుతుందని వివరించారు.
తల్లిపాలు అందించడం ద్వారా పోషకాహార లోపం, అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుందని, ఆరోగ్యవంతమైన భావితరాల నిర్మాణానికి తల్లిపాలు అత్యంత కీలకమని ఆమె నొక్కి చెప్పారు. తల్లి తన బిడ్డకు తల్లిపాలు అందించేలా కుటుంబ సభ్యులు పూర్తి సహకారం అందించాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య, ఉప సర్పంచ్ పేరుక బుచ్చయ్య, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శి, ఆయాలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, సీఏలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.









