రష్యాపై కొత్తగా అమలు చేయాల్సిన ఆంక్షలు, సుంకాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మినహాయింపు ఇవ్వడం అమెరికా రాజకీయాల్లో వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయంపై డెమోక్రటిక్ పార్టీకి చెందిన పలువురు నేతలు తీవ్ర విమర్శలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ట్రంప్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
రష్యా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన లిండ్సే ఓ. గ్రాహం రష్యా, ఇరాన్ ఆంక్షల చట్టం2026లో భాగంగా కొత్త ఆంక్షలు, సుంకాలు అమలు చేయాల్సి ఉంది. న ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుతో ఈ చర్యలకు మినహాయింపు కల్పించారు.
అమెరికా జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ కాంగ్రెస్‌కు తెలియజేశారు. రష్యా నుంచి చమురు, సహజ వాయువు కొనుగోలు చేసే ప్రధాన దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఈ చట్టంలో ఉంది. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాలపై కూడా ఈ చర్యల ప్రభావం పడే అవకాశం ఉండేది.
విమర్శలు
ట్రంప్ నిర్ణయంపై అమెరికా డెమోక్రటిక్ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయకుండా నిలిపివేయడం ద్వారా పుతిన్‌కు ప్రయోజనం కల్పిస్తున్నారని విమర్శించారు.
వర్జీనియా ప్రతినిధి డాన్ బేయర్ ఈ నిర్ణయాన్ని ఉక్రెయిన్ భాగస్వాములకు ద్రోహం చేయడంగా అభివర్ణించారు. సెనేటర్ రిచర్డ్ బ్లూమెంతాల్ కూడా ఆంక్షలకు మినహాయింపు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్య అమెరికా కాంగ్రెస్ ఉద్దేశానికి విరుద్ధంగా ఉందని విమర్శకులు పేర్కొన్నారు.
డీజిల్ ఒప్పందం వివాదం
రష్యా నుంచి డీజిల్ సరఫరాకు సంబంధించిన ఒప్పందం నేపథ్యంలోనూ ట్రంప్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఇంధన ధరలను తగ్గించేందుకు రష్యా నుంచి డీజిల్ సరఫరా చేసుకునే ఒప్పందం కుదిరినట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే, దీనివల్ల రష్యాకు ఆదాయం సమకూరి ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని కొనసాగించేందుకు పరోక్షంగా తోడ్పాటు లభిస్తుందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఒప్పందాన్ని పునఃపరిశీలించాలని డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకు చెందిన కొందరు సెనేటర్లు కూడా కోరారు. ట్రంప్ మాత్రం ఆంక్షలపై మినహాయింపు అమెరికా జాతీయ ప్రయోజనాలకు అవసరమని సమర్థిస్తున్నారు. ఈ నిర్ణయం ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా విధానం, రష్యాతో సంబంధాలు, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది రానున్న రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది.












