కార్ల తయారీ పరిశ్రమ స్థాపనకు తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ అత్యంత అనువైన ప్రాంతమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హ్యూందాయ్ ఇండియా సంస్థకు తెలిపారు. తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రితో హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఇంజినీరింగ్ () మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్యోన్ చో నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది.
భౌగోళికంగా తెలంగాణ దేశంలో మధ్య భాగంలో ఉండటం, హైదరాబాద్ అత్యంత సురక్షితమైన, జీవించడానికి అనుకూలమైన నగరంగా గుర్తింపు పొందడం వంటి సానుకూల పరిస్థితులను ముఖ్యమంత్రి వివరించారు.
జహీరాబాద్‌లోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ ()లో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ () సమగ్ర గ్లోబల్ ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటు పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ఈ కేంద్రం ద్వారా రూ. 8,528 కోట్ల భారీ పెట్టుబడితో 4,276 ఉద్యోగాలు కల్పించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. 678 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు.
ప్రాజెక్టు పురోగతిని హ్యుందాయ్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రికి వివరించింది. రానున్న కొన్ని నెలల్లో శంకుస్థాపనకు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.
2024 ప్రపంచ ఆర్థిక సదస్సు () సందర్భంగా, పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం హ్యుందాయ్ ప్రతినిధులతో సమావేశమైంది. అనంతరం, ప్రతిష్ఠాత్మక ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటుకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది.
తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమకు బలమైన రవాణా మౌలిక సదుపాయాలు, భవిష్యత్తులో హైస్పీడ్ రవాణా అనుసంధానం వంటివి మరింత అనుకూలంగా మారుతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పెరి-అర్బన్ రీజియన్ () వంటి నమూనాల ద్వారా పారిశ్రామిక విస్తరణకు రాష్ట్రం సిద్ధంగా ఉందని చెప్పారు.
ప్రపంచ స్థాయి సౌకర్యాలతో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించాలన్న ప్రభుత్వ దార్శనికతను ముఖ్యమంత్రి వివరించారు. 2026లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా హ్యుందాయ్ నాయకత్వ బృందాన్ని ఆహ్వానించారు.
తెలంగాణ అభివృద్ధి ప్రస్థానంలో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్యోన్ చో తెలిపారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో హ్యుందాయ్ మోటార్స్ ఇప్పటికే అధునాతన వాహన ఇంజినీరింగ్‌పై పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
జహీరాబాద్ నిమ్జ్‌లో ఏర్పాటు చేయనున్న ఆర్ అండ్ డీ కేంద్రం, భారీ వాహన పరీక్షా కేంద్రం వాహనాల పరీక్షలు, పనితీరు ధ్రువీకరణ, ఇంజినీరింగ్ ప్రక్రియల మెరుగుదలలో కీలక పాత్ర పోషించనుంది. ఈ సమావేశంలో సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.











