ఢిల్లీలో ప్రతి బాలిక ఎలాంటి భయం లేకుండా తన లక్ష్యాల వైపు ముందుకు సాగాలని ముఖ్యమంత్రి రేఖా గుప్తా పిలుపునిచ్చారు. బాలికల భద్రత, గౌరవం, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న దౌలత్ రామ్ కళాశాలలో నూతన భవనాలు, కేంద్రాలను ఆమె ప్రారంభించారు.
దౌలత్ రామ్ కళాశాలలో శతాబ్ది విద్యా భవనం, కంప్యూటర్ కేంద్రం, నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం విద్యార్థినులతో మాట్లాడిన సీఎం, ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదలతో తమ ఆశయాలను సాధించాలని సూచించారు.
విద్యతో పాటు నైపుణ్యాల ఆవశ్యకత
విద్య అంటే కేవలం పట్టా పొందడం మాత్రమే కాదని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆచరణాత్మక నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు స్వయం సమృద్ధి సాధించగలరని రేఖా గుప్తా తెలిపారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేందుకు ఈ నైపుణ్యాలు దోహదపడతాయని, పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ బాలికలు తమ సామర్థ్యాలపై నమ్మకం ఉంచాలని, లక్ష్యాలను చేరుకునే విషయంలో వెనుకడుగు వేయకూడదని సూచించారు.
మహిళల భద్రతకు ప్రభుత్వం చర్యలు
ఢిల్లీలో మహిళలు, బాలికల భద్రతను మెరుగుపరిచేందుకు లక్ష స్మార్ట్ వీధి దీపాలను ఏర్పాటు చేసే పనులు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ దీపాలను నియంత్రణ, పర్యవేక్షణ కేంద్రానికి అనుసంధానించడం ద్వారా పనిచేయని దీపాలను గుర్తించి, నిర్ణీత సమయంలో మరమ్మతులు చేపట్టేందుకు వీలవుతుందని, వీధుల్లో చీకటి ప్రాంతాలను తగ్గించడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. అలాగే నగరవ్యాప్తంగా మరో 50 వేల నిఘా కెమెరాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఈ చర్యల ద్వారా ప్రజా ప్రదేశాల్లో పర్యవేక్షణను పెంచి, ముఖ్యంగా మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
మహిళల భద్రత బాధ్యత కేవలం బాలికలపైనే ఉండకూడదని, బాలికలపై ఆంక్షలు విధించడం కంటే, మహిళలను గౌరవించేలా బాలురు, పురుషుల్లో సామాజిక దృక్పథాన్ని పెంపొందించాలని సూచించారు. వేధింపులు, బెదిరింపులు ఎదురైనప్పుడు మౌనంగా ఉండకుండా ధైర్యంగా తమ గళాన్ని వినిపించాలని విద్యార్థినులకు పిలుపునిచ్చారు.
స్వీయరక్షణ శిక్షణ, టాలెంట్ హంట్ ప్రారంభం
కళాశాలలో మహిళా వికాస్ సమితికి చెందిన విద్యార్థినులు ప్రదర్శించిన స్వీయరక్షణ పద్ధతులను ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఇలాంటి శిక్షణ కష్టసమయాల్లో తమను తాము రక్షించుకోవడానికి ఉపయోగపడటమే కాకుండా, వ్యక్తిగత ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు మిస్ డీఆర్సీ టాలెంట్ హంట్ కార్యక్రమాన్ని కూడా రేఖా గుప్తా ప్రారంభించారు. విద్యార్థులు తమలోని సృజనాత్మకతను, ప్రత్యేక నైపుణ్యాలను నిర్భయంగా ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.
రేఖా గుప్తా ఇదే కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థిని. తన విద్యార్థి దశను గుర్తుచేసుకుంటూ, కళాశాల విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనప్పుడే తన ప్రజాజీవితం ప్రారంభమైందని, విద్యార్థి రాజకీయాల్లో తనకు ఎదురైన అనుభవాలు ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడానికి, వాటి పరిష్కారానికి కృషి చేయడానికి ప్రేరణనిచ్చాయని వివరించారు. సందర్శనలో భాగంగా కళాశాలలోని వివిధ విభాగాలను పరిశీలించి, ఆడిటోరియం పునరుద్ధరణకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.










