జమ్మూకశ్మీర్లో సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార్ రాజీవ్ రంజన్, మహిళా జేకేఏఎస్ అధికారి బీనిష్ వాణితో అధికారిక ఆన్లైన్ సమావేశంలో దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొంది.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార్ రాజీవ్ రంజన్, మహిళా జేకేఏఎస్ అధికారి బీనిష్ వాణితో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. అధికారిక ఆన్లైన్ సమావేశంలో ఆమెను దుర్భాషలాడారని ఆరోపణలు రావడంతో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ అధికారిగా ఐఏఎస్ అధికారి మందీప్ కౌర్ను నియమించగా, 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా స్పందించారు.
సమావేశానికి సంబంధించినదని చెబుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అందులో రాజీవ్ రంజన్ అభ్యంతరకరమైన భాష ఉపయోగించినట్లు, తనను అలా సంబోధించడాన్ని బీనిష్ వాణి ప్రశ్నించినట్లు కనిపిస్తోంది. ఆమెను సస్పెండ్ చేయాలని కూడా సీనియర్ అధికారి సూచించినట్లు వీడియోలో ఉన్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు విచారణలో తేలాల్సి ఉంది.
15 రోజుల్లో నివేదిక
జమ్మూకశ్మీర్ సాధారణ పరిపాలనా శాఖ న విచారణకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. మందీప్ కౌర్ విచారణ అధికారిగా వ్యవహరించనుండగా, అమిత్ వర్మానీ ప్రజెంటింగ్ అధికారిగా నియమితులయ్యారు. ఆరోపణలపై సమగ్రంగా పరిశీలించి, 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఒమర్ అబ్దుల్లా స్పందన
ఈ వీడియోను తాను చూశానని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ప్రాథమికంగా చూస్తే సీనియర్ అధికారి ప్రవర్తన ఆ స్థాయి అధికారికి ఉండాల్సిన ప్రమాణాలకు అనుగుణంగా లేదని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. మహిళా అధికారిపై ప్రతీకార చర్యలు తీసుకోకుండా చూడాలని కూడా ఆదేశించినట్లు వెల్లడించారు.
జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కావడంతో ఐఏఎస్ అధికారులపై పరిపాలనా నియంత్రణ విషయంలో తన ప్రభుత్వానికి పరిమితులు ఉన్నాయని ఒమర్ పేర్కొన్నారు. అయినప్పటికీ, మహిళా అధికారి గౌరవం, ఉద్యోగ భద్రత కాపాడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ ఘటనను జాతీయ మహిళా కమిషన్ కూడా పరిగణనలోకి తీసుకుంది. జమ్మూకశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఏడు రోజుల్లో చర్యల నివేదిక సమర్పించాలని కోరింది. కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులకు గౌరవప్రదమైన, సురక్షితమైన వాతావరణం కల్పించాలని సూచించింది. విచారణలో ఆరోపణలు నిర్ధారణ అయితే తదుపరి క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఈ ఘటనపై జేకేఏఎస్ అధికారుల సంఘం నిరసన తెలిపింది. సీనియర్ అధికారుల నుంచి సహోద్యోగులకు గౌరవప్రదమైన ప్రవర్తన ఉండాలని, ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరగాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు నిర్ణయించనున్నారు.


