ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూలైలో జరిగిన విద్యార్థుల నిరసనల్లో పోలీసులు అత్యుత్సాహంగా వ్యవహరించారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలపై విచారణ జరుపుతున్న ఉన్నతస్థాయి కమిటీ నెల రోజుల్లోగా ప్రాథమిక నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఫిర్యాదులు తక్కువగా వచ్చాయని విచారణను ఆలస్యం చేయకుండా, ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా విచారణను కొనసాగించాలని స్పష్టం చేసింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ ఏడాది జూలైలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసనలు చేపట్టారు. నీట్ సహా పలు పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలపై ఆందోళన నిర్వహించారు.
ఈ క్రమంలో పార్లమెంట్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో లాఠీచార్జి, భాష్పవాయు గోళాలు, పెల్లెట్ గన్స్ వినియోగించారని, పలువురు విద్యార్థులు గాయపడ్డారని పిటిషనర్లు ఆరోపించారు. మహిళా నిరసనకారులపై దాడులు, వేధింపులు జరిగినట్లు కూడా ఫిర్యాదులు వచ్చాయి.
ఈ ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. పోలీసుల బలప్రయోగం, మహిళా నిరసనకారులపై దాడులు, గాయపడిన వారికి పరిహారం, పోలీసులపై నిరసనకారుల దాడులు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వంటి 12 అంశాలను పరిశీలించాలని ఆదేశించింది.
అయితే, విచారణ కోసం ప్రత్యేక వెబ్సైట్, ఈ-మెయిల్ ఏర్పాటు చేసినప్పటికీ బాధితుల నుంచి చాలా తక్కువ ఫిర్యాదులు అందాయని కమిటీ సుప్రీంకోర్టుకు తెలిపింది. జరిగిన సమావేశానికి ఒక్క ఫిర్యాదుదారుడు మాత్రమే హాజరై అఫిడవిట్ సమర్పించినట్లు వెల్లడించింది. కొందరు పోలీసు సిబ్బంది కూడా కమిటీ ఎదుట తమ వాదనలు వినిపించారు.
ఈ సందర్భంగా బాధితుల తరఫున న్యాయవాదులు ఇప్పటికే కోర్టుకు సమర్పించిన పిటిషన్లు, అఫిడవిట్లు, వీడియో ఆధారాలను కూడా విచారణలో పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. బాధితులు స్వయంగా ఫిర్యాదు చేయకపోయినా, వారి తరఫున ఇతరులు సమర్పించిన ఆధారాలను పరిశీలించాలని తెలిపింది. బాధితులు తమ పేర్లు, వ్యక్తిగత వివరాలు వెల్లడించకుండానే ఫిర్యాదులు సమర్పించవచ్చని పేర్కొంది.
పోలీసులపై ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని, శాఖాపరమైన విచారణ కూడా ప్రారంభించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, కమిటీ ఏర్పాటు చేసినంత మాత్రాన పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అధికారాలకు అడ్డంకి ఉండదని స్పష్టం చేసింది. విచారణలో వాస్తవాలు తేలిన తర్వాత అవసరమైన చర్యలపై నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, నిరసనల్లో పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారని, వారి ఫిర్యాదులను సైతం విచారణలో పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.












