తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మహారాష్ట్రకు చెందిన వ్యాపారి మచీంద్ర శాంతారాం లంకే దాఖలు చేసిన ఈ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కేసుపై చేస్తున్న వ్యాఖ్యలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం నెలకొందని, నిష్పక్షపాత విచారణకు ఇబ్బంది కలగవచ్చని నిందితుడి తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన నిందితులకు భాషాపరమైన సమస్యలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ వాదనలను అంగీకరించలేదు. కేసుకు సంబంధించిన సాక్షులు, ఆధారాలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని, విచారణను మరో రాష్ట్రానికి మార్చాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజకీయ నేతల వ్యాఖ్యల ప్రభావం న్యాయస్థానాలపై ఉండదని పేర్కొంటూ సుప్రీంకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. ఈ కేసు దర్యాప్తు కోసం గతంలో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.












