కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో భూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి, రెవెన్యూ రికార్డులు, భూ భారతి దస్త్రాలను పరిశీలించారు.
ప్రజల నుంచి వచ్చే భూ సంబంధిత దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారించి, రికార్డులను సరిచూసిన అనంతరం నిబంధనల ప్రకారం పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. కార్యాలయంలో ఉద్యోగుల హాజరు పట్టిక, రికార్డుల గది, భూ భారతి ఫైళ్లను ఆమె పరిశీలించారు.
భూముల పునఃసర్వేపై ఆదేశాలు
భూ సమస్యల పరిష్కారంలో జాప్యం జరగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భూముల పునఃసర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, సర్వే నిర్వహించే తేదీకి ముందుగానే రైతులకు నోటీసులు అందించాలని ఆదేశించారు.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియ
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పూర్తి స్థాయిలో నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాబితాలో పేర్లు సరిపోలని, ఇతర వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేసి, నిబంధనల ప్రకారం అవసరమైన ధ్రువపత్రాలను స్వీకరించాలని తెలిపారు.
జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, కొత్త ఓటరు నమోదు కోసం ఫారం-6 దరఖాస్తులను స్వీకరించాలని అధికారులకు సూచించారు. ఈ తనిఖీలో నాయబ్ తహసీల్దార్ హరిలాల్తో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.












