జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమించి పట్టుదలతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని నిరూపించారు జౌ కున్ఫే. చిన్న వయసులోనే చదువును మధ్యలో ఆపేసి కుటుంబ పోషణ కోసం ఫ్యాక్టరీలో కార్మికురాలిగా చేరారు. రోజుకు సుమారు రూ.100 మాత్రమే సంపాదించేవారు. కానీ తన ప్రతిభ, కృషి, వ్యాపార దక్షతతో ఇప్పుడు చైనాలోనే అత్యంత ధనవంతురాలిగా నిలిచారు.
2026 హురున్ ధనిక మహిళల జాబితాలో అగ్రస్థానాన్ని తిరిగి దక్కించుకున్నారు. 1970లో చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని ఓ గ్రామంలో జౌ కున్ఫే జన్మించారు. పేద కుటుంబంలో పుట్టిన ఆమెకు చిన్నతనం నుంచే ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కుటుంబ పరిస్థితుల కారణంగా యుక్తవయసులోనే చదువును మధ్యలో ఆపేశారు. అనంతరం ఉపాధి కోసం షెన్జెన్ నగరానికి వెళ్లారు.
అక్కడ ఓ వాచ్ గ్లాస్ తయారీ కర్మాగారంలో కార్మికురాలిగా పనిచేశారు. రోజుకు సుమారు 1.20 డాలర్లు, అంటే అప్పటి లెక్కల ప్రకారం రూ.100కు కొద్దిగా ఎక్కువ మాత్రమే వేతనంగా వచ్చేది. తక్కువ జీతంతో ఎక్కువ గంటలు పనిచేయాల్సి వచ్చేది. అయినప్పటికీ పని చేస్తూనే తయారీ ప్రక్రియలు, గాజు ఉత్పత్తి సాంకేతికతలను ఆసక్తిగా నేర్చుకున్నారు.
23 ఏళ్లకే సొంత వ్యాపారం
ఫ్యాక్టరీలో పనిచేసిన అనుభవం ఆమెకు వ్యాపారంపై అవగాహన కల్పించింది. 1993లో, తన 23వ ఏట సొంతంగా గాజు ప్రాసెసింగ్ వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. మొదట చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ వ్యాపారాన్ని క్రమంగా విస్తరించారు. స్క్రీన్ ప్రింటింగ్, వంపు ఆకారంలో ఉండే గాజు తయారీ వంటి ప్రత్యేక నైపుణ్యాలను స్వయంగా నేర్చుకున్నారు. తక్కువ వనరులతో ప్రారంభించిన ఈ సంస్థ క్రమంగా పెద్ద తయారీ సంస్థగా ఎదిగింది. అనంతరం ఆమె స్థాపించిన వ్యాపారం లెన్స్ టెక్నాలజీగా అభివృద్ధి చెందింది. స్మార్ట్ఫోన్లకు అవసరమైన గాజు తెరల తయారీలో ఈ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
యాపిల్ ఐఫోన్లతో మారిన అదృష్టం
2007లో యాపిల్ సంస్థ తన తొలి ఐఫోన్లకు అవసరమైన గాజు కవర్ల తయారీ కోసం లెన్స్ టెక్నాలజీతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం సంస్థ ఎదుగుదలలో కీలక మలుపుగా మారింది. అనంతరం స్మార్ట్‌ఫోన్ తయారీ రంగంలో ప్రముఖ సంస్థలకు గాజు భాగాలను సరఫరా చేసే స్థాయికి చేరుకుంది. 2011 నుంచి 2014 మధ్య కాలంలో లెన్స్ టెక్నాలజీ ప్రధాన వ్యాపార ఆదాయంలో యాపిల్ వాటా దాదాపు సగం వరకు ఉన్నట్లు సంస్థ సమర్పించిన పత్రాలు సూచించాయి. 20 లో షెన్జెన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో కంపెనీ నమోదైంది. దీంతో జౌ కున్ఫే తొలిసారిగా చైనాలో అత్యంత ధనవంతురాలైన మహిళగా గుర్తింపు పొందారు.
రూ.1.80 లక్షల కోట్లకు పైగా సంపద
హురున్ రీసెర్చ్ విడుదల చేసిన 2026 చైనా అత్యంత ధనవంతులైన మహిళల జాబితా ప్రకారం జౌ కున్ఫే సంపద 127 బిలియన్ యువాన్లుగా అంచనా వేశారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.1.80 లక్షల కోట్లకు పైమాటే. గత ఏడాదితో పోలిస్తే ఆమె సంపద 15 శాతం పెరిగింది. ఈ జాబితాలో 124 బిలియన్ యువాన్ల సంపదతో హాన్సో ఫార్మాస్యూటికల్ వ్యవస్థాపకురాలు జోంగ్ హుయిజువాన్ రెండో స్థానంలో ఉన్నారు. 2015లో తొలిసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్న జౌ కున్ఫే, 11 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ స్థానాన్ని సాధించారు.
స్మార్ట్‌ఫోన్ గాజు తయారీతో ఎదిగిన లెన్స్ టెక్నాలజీ ప్రస్తుతం తన వ్యాపారాన్ని ఇతర రంగాలకూ విస్తరిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన డిస్ప్లేలు, కృత్రిమ మేధ ఆధారిత పరికరాలు, రోబోటిక్స్ వంటి రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. 2025 జులైలో హాంకాంగ్ స్టాక్ మార్కెట్లోనూ కంపెనీ రెండోసారి నమోదైంది. ఈ విస్తరణకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడం సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.







