భద్రాచలం, 2026-11-23
జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు భద్రాచలం పర్యటనలో ప్రముఖ వైద్యులు డాక్టర్ పిన్నింటి రాజశేఖర్‌ను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు, రాజకీయ పరిణామాలపై చర్చించారు.
ఉమ్మడి ఖమ్మంనల్గొండవరంగల్ జిల్లాల జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి, తెలంగాణ రాష్ట్ర జనసేన కన్వీనర్, మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు భద్రాచలం పర్యటనలో భాగంగా స్థానిక ప్రముఖ వైద్యులు డాక్టర్ పిన్నింటి రాజశేఖర్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరయ్యేందుకు భద్రాచలం వచ్చిన ఆయనకు డాక్టర్ పిన్నింటి రాజశేఖర్, కమల రాజశేఖర్ దంపతులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు ఆత్మీయంగా పలకరించుకుని కొద్దిసేపు వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం డాక్టర్ గడల శ్రీనివాసరావుకు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ప్రతిమను బహూకరించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. భద్రాచలం ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని చాటిచెప్పే స్వామివారి ప్రతిమను అందజేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ భేటీలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భద్రాచలం నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయడం, కార్యకర్తలను సమాయత్తం చేయడంపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో స్థానిక ప్రముఖులను కలుస్తూ ఎన్నికల సన్నాహాలను కొనసాగిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో తమళ్ళ వెంకటేశ్వరరావు (టీవీ), రాంప్రసాద్, బండారు శ్రీకాంత్, వారల వేణు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.







