సిద్దిపేట, జూలై 28
మాజీ కేంద్ర మంత్రి సురేష్ జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా కోహెడలో ఘనంగా నివాళులర్పించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, కంటెస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జైపాల్ రెడ్డి సేవలను కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
మాజీ కేంద్ర మంత్రి సురేష్ జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా కోహెడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రముఖ సామాజిక కార్యకర్త, కంటెస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిడిశెట్టి రాజు మాట్లాడుతూ, పోలియోతో శారీరక వైకల్యం వచ్చినా రాజకీయ జీవితంలో ఎన్నో శిఖరాలు అధిరోహించిన జైపాల్ రెడ్డి ఆదర్శ నాయకుడని కొనియాడారు. కేంద్ర మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా విశేష సేవలందించిన ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో తెరవెనుక అత్యంత కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. తెలంగాణ ఆకాంక్షను కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లడంలోనూ, హైదరాబాద్ తెలంగాణలోనే కొనసాగేలా వ్యూహాత్మకంగా వ్యవహరించడంలోనూ ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో జైపాల్ రెడ్డి పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని చెప్పారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్ జైపాల్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కోహెడ సర్పంచ్ బందెల సుజాత–బాలకిషన్, ఏఎంసీ చైర్మన్ బోయిని నిర్మల–జయరాజు, ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు చింతకింది శంకర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










