పోలీసు శాఖలో అధికారుల బదిలీల వ్యవహారం వివాదానికి దారితీసింది. తమ అధికారుల బదిలీలను వ్యతిరేకిస్తూ పోలీసు సిబ్బంది నిర్వహించిన నిరసనలో పాల్గొని నాయకత్వం వహించిన ఏసీపీ మనస్వి వశిష్ఠను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పోలీసు ప్రధాన కార్యాలయం ఎదుట ఈ నిరసన జరిగింది.
మరుసటి రోజే ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. అసలు వివాదం షహదారా పోలీస్‌స్టేషన్‌లో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ప్రారంభమైంది. ఈ ఘటనలో న్యాయవాది లలిత్ బన్సల్ తలకు తీవ్ర గాయమైనట్లు సమాచారం.
న్యాయవాదుల ఆరోపణలు
పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన న్యాయవాదులు తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, బెదిరించారని ఆరోపించారు. ఏసీపీ మనస్వి వశిష్ఠ తుపాకీ చూపించి బెదిరించారని కూడా న్యాయవాదులు ఆరోపించారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కోర్టుల న్యాయవాదులు నిరవధిక విధుల బహిష్కరణకు దిగారు.
అధికారుల బదిలీలు
వివాదం నేపథ్యంలో ఏసీపీ మనస్వి వశిష్ఠను గాంధీనగర్ విభాగం నుంచి మహిళలు, చిన్నారుల ప్రత్యేక పోలీసు విభాగానికి బదిలీ చేశారు. షహదారా ఎస్‌హెచ్‌వో ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్‌ను కూడా భద్రతా విభాగానికి మార్చారు. ఈ బదిలీల అనంతరం న్యాయవాదులు తమ ఆందోళనను విరమించారు.
పోలీసుల నిరసన
తమ అధికారుల బదిలీలపై అసంతృప్తి వ్యక్తం చేసిన పోలీసు సిబ్బంది పోలీసు ప్రధాన కార్యాలయం ఎదుట సమావేశమయ్యారు. మనస్వి వశిష్ఠ, ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్‌లను తిరిగి పాత స్థానాల్లో నియమించాలని డిమాండ్ చేశారు. సుమారు 150 మంది సిబ్బందితో ప్రారంభమైన ఈ నిరసనలో మహిళా పోలీసులూ పాల్గొన్నారు.
అనంతరం పోలీసు కమిషనర్ అనురాగ్ కుమార్‌ను కలిసి తమ సమస్యలను వివరించాలని కోరారు. ఈ సమావేశాన్ని నిరసనగా కాకుండా సంపర్క సభగా పేర్కొన్న పోలీసు అధికారులు.. సిబ్బంది సమస్యలను వినేందుకు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. పోలీసు శాఖ గౌరవం, విధి నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు వంటి అంశాలను సిబ్బంది ప్రస్తావించారు.
పోలీసు సిబ్బంది, న్యాయవాదుల మధ్య విధి నిర్వహణ సమయంలో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో, పోలీసు ప్రధాన కార్యాలయ స్థాయిలో సంయుక్త సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పోలీసు శాఖ వెల్లడించింది. ఈ కమిటీల్లో బార్ అసోసియేషన్లు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు ఉంటారు.
పదోన్నతులు, ఎంఏసీపీ ప్రయోజనాలు, నివాస వసతి తదితర సేవా సంబంధిత సమస్యలను కూడా పరిష్కరించాలని పోలీసు కమిషనర్ అధికారులను ఆదేశించారు. జిల్లా, విభాగాల అధిపతులు క్రమం తప్పకుండా సంపర్క సభలు నిర్వహించాలని సూచించారు.












