దేశవ్యాప్తంగా అమూల్ తన పాల ఉత్పత్తులైన నెయ్యి, వెన్న ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరల పెంపుతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది. కొత్త ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.
తాజా ధరల ప్రకారం, కిలో నెయ్యి ప్యాక్ ధర రూ.630 నుంచి రూ.680కి పెరిగింది. అదేవిధంగా, 500 గ్రాముల స్వచ్ఛమైన నెయ్యి ప్యాక్ ధర రూ.325 నుంచి రూ.345కు చేరింది. వెన్న ధరల్లోనూ పెరుగుదల కనిపించింది. 100 గ్రాముల వెన్న ప్యాక్ ధర రూ.63 నుంచి రూ.66కు, 500 గ్రాముల ప్యాక్ ధర రూ.310 నుంచి రూ.325కు పెరిగింది. ఈ కొత్త ధరలు దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ దుకాణాలతో పాటు ఆన్లైన్ విక్రయ వేదికల్లోనూ అమల్లోకి వచ్చాయి. పాల ఉత్పత్తి వ్యయం, పశువుల దాణా, ప్యాకేజింగ్, ఇంధన ఖర్చులు పెరగడమే ఈ ధరల పెంపునకు కారణమని అమూల్ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో నెయ్యి, వెన్నకు డిమాండ్ పెరుగుతుంది. ఈ సమయంలో ధరల పెంపు వినియోగదారులకు ఇబ్బందికరంగా మారనుంది.








