ఢిల్లీఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. నవంబర్ 1 నుండి 20 వరకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో గరిష్ఠంగా 50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరు కావాలని, మిగిలిన వారు ఇంటి నుంచే పని చేయాలని వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (సీఏక్యూఎం) ఆదేశించింది.
శీతాకాలంలో కాలుష్యం తీవ్రత పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధనలు ఢిల్లీతో పాటు గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్, ఘాజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా) జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వర్తిస్తాయి. కార్యాలయాల యాజమాన్యాలు సిబ్బంది హాజరును 50 శాతానికి పరిమితం చేసి, మిగిలిన ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేలా ఏర్పాట్లు చేయాలి.
అయితే, ఇంటి నుంచే పని చేయడం సాధ్యం కాని పారిశ్రామిక సంస్థలు, అత్యవసర సేవలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు కల్పించారు.
నిర్మాణ పనులపై ఆంక్షలు
కాలుష్యానికి కారణమయ్యే దుమ్ము, ధూళిని తగ్గించేందుకు ఢిల్లీఎన్సీఆర్ అంతటా దుమ్ము వెలువడే కూల్చివేత పనులు, బహిరంగ నిర్మాణ కార్యకలాపాలపై కూడా నవంబర్ 1 నుండి 20 వరకు ఆంక్షలు విధించారు. రహదారులు, జాతీయ రహదారులు, ఫ్లైఓవర్లు, విద్యుత్ ప్రసార లైన్లు, పైప్లైన్లు, టెలికమ్యూనికేషన్ పనులు వంటి మౌలిక వసతుల నిర్మాణాలకూ ఈ పరిమితులు వర్తిస్తాయి.
అయితే రైల్వేలు, మెట్రో, విమానాశ్రయాలు, అంతర్రాష్ట్ర బస్ టెర్మినళ్లు, ఆసుపత్రులు, తాగునీరు, పారిశుధ్యం, జాతీయ భద్రత, రక్షణకు సంబంధించిన ప్రాజెక్టులకు మినహాయింపులు ఇచ్చారు.
కాలుష్యం పెరుగుదలపై అధ్యయనం
2018 నుండి 2025 వరకు నవంబర్ నెలలో నమోదైన వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) వివరాలను పరిశీలించిన సీఏక్యూఎం.. ప్రతి ఏడాది నవంబర్ ప్రారంభం నుండి మధ్యకాలంలో కాలుష్యం పెరుగుతున్నట్లు గుర్తించింది. తక్కువ గాలి వేగం, వాహనాల ఉద్గారాలు, వ్యవసాయ వ్యర్థాలు మరియు ఇతర కాలుష్య కారకాల ప్రభావంతో ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతుందని అధికారులు పేర్కొన్నారు.
కాలుష్య స్థాయులు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరకుండా ముందుగానే ఉద్గారాలను తగ్గించడమే ఈ ఆంక్షల ప్రధాన ఉద్దేశమని కమిషన్ తెలిపింది.


