దీపావళి సందర్భంగా స్విగ్గీ, జెప్టో వంటి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా స్వీట్లు, స్నాక్స్, పూలు, పూజా సామగ్రి, బహుమతులు, బంగారం, వెండి నాణేలను భారతీయులు అధికంగా కొనుగోలు చేశారు.
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో అత్యధికంగా ఆర్డర్ చేసిన స్వీట్లలో కాజు కట్లీ మొదటి స్థానంలో నిలవగా, మోతీచూర్ లడ్డూ, బేసన్ లడ్డూ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దీపావళి సందర్భంగా పార్టీ ఏర్పాట్లకు సంబంధించిన ఆర్డర్లు గత ఏడాదితో పోలిస్తే 162 శాతం పెరిగాయి. స్నాక్స్, మంచీస్ కొనుగోళ్లు 42 శాతం వృద్ధి చెందాయి. పండుగకు ముందు డైట్ కోక్ అత్యధికంగా ఆర్డర్ చేసిన నాన్-గ్రోసరీ వస్తువుగా నిలిచింది. మరోవైపు జెప్టోలో గిఫ్ట్ హ్యాంపర్ల ఆర్డర్లు గత దీపావళితో పోలిస్తే మూడు రెట్లు పెరిగాయి. మొత్తం 4.68 లక్షల దీపాల ఆర్డర్లు నమోదయ్యాయి. పూలు, పూలమాలల కొనుగోళ్లు 2.5 రెట్లు పెరిగాయి. బంగారు, వెండి నాణేల కొనుగోళ్లలోనూ వినియోగదారులు ఆసక్తి చూపారు. అర్ధరాత్రి 12:00 గంటల 30 సెకన్లకు హైదరాబాద్ నుంచి స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో తొలి 24 క్యారెట్ల బంగారు నాణెం ఆర్డర్ నమోదైంది. ఆ తర్వాత నాలుగు సెకన్లకు బెంగళూరు నుంచి వెండి నాణెం ఆర్డర్ వచ్చింది. కొనుగోలు చేసిన బంగారు నాణేల్లో దాదాపు మూడింట రెండొంతులు పూల డిజైన్లలో ఉండగా, వెండి నాణేల్లో 73 శాతం లక్ష్మీదేవి, వినాయకుడి చిత్రాలతో కూడినవిగా ఉన్నాయి. అత్యధిక విలువైన పండుగ షాపింగ్ ఆర్డర్ ముంబైలో రూ.1.11 లక్షలుగా నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన ఓ వినియోగదారుడు రూ.52,215 విలువైన ఆర్డర్ పెట్టగా, అందులో రెండు గ్రాముల బంగారు నాణెంతో పాటు 100 గ్రాముల వెండి బార్ ఉన్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య అత్యధిక ఆర్డర్లు నమోదయ్యాయి. ఈ వివరాలు భారతీయుల ఆన్లైన్ కొనుగోలు అలవాట్లలో వస్తున్న మార్పులను, క్విక్ కామర్స్ సేవలు నిత్యావసరాలకే కాకుండా పండుగ షాపింగ్, విలువైన వస్తువుల కొనుగోళ్లకు కూడా విస్తరిస్తున్న తీరును తెలియజేస్తున్నాయి.

