పాకిస్థాన్‌లో పోలియో వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా మారింది. 2026లో ఇప్పటివరకు దేశంలో తొమ్మిదో పోలియో కేసు నమోదైంది. పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్‌లోని జిల్లాకు చెందిన ఏడు నెలల బాలుడికి వైల్డ్ పోలియో ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ బాలుడితో కలిపి జిల్లాలో కేసుల సంఖ్య మూడుకు చేరింది.
పాకిస్థాన్‌లో నమోదైన మొత్తం తొమ్మిది కేసుల్లో ఏడు పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో, మరో రెండు సింధ్ ప్రావిన్స్‌లో వెలుగుచూశాయి. జిల్లాలో నమోదైన మూడు కేసుల్లో గుర్తించిన వైరస్‌కు పొరుగున ఉన్న అఫ్గానిస్థాన్‌లో వ్యాపిస్తున్న వైరస్‌తో జన్యుపరమైన సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అఫ్గానిస్థాన్‌లో ఈ ఏడాది 50 పోలియో కేసులు నమోదయ్యాయి. దీంతో సరిహద్దుల మధ్య వైరస్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పాకిస్థాన్‌లోని 97 జిల్లాల్లో ఐదేళ్లలోపు సుమారు 2.4 కోట్ల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు ప్రత్యేక టీకా కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నాలుగు ప్రావిన్సుల ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని వారం రోజుల్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పోలియోకు నిర్దిష్ట చికిత్స లేనప్పటికీ, టీకాల ద్వారా వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని ఆరోగ్య అధికారులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి నిరంతర టీకా కార్యక్రమాలు, ప్రజల సహకారం అత్యవసరమని వారు నొక్కి చెబుతున్నారు.












