ఆయుష్ వైద్య విద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ () 2026 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ () విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 51,482 మంది నమోదు చేసుకోగా, 49,864 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 27,711 మంది అర్హత సాధించారు.
ఆయుర్వేదం, హోమియోపతి, సిద్ధ, యునానీ విభాగాల్లో పీజీ ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా 104 నగరాల్లోని 205 పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష జరిగింది. జైపూర్‌లోని ఒక కేంద్రానికి సంబంధించిన 49 మంది అభ్యర్థులకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించారు.
విభాగాల వారీగా అర్హత సాధించినవారు
2026లో మొత్తం 27,711 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో ఆయుర్వేదంలో 19,920 మంది, హోమియోపతిలో 5,934 మంది, యునానీలో 1,425 మంది, సిద్ధలో 432 మంది అర్హత సాధించారు.
విభాగాల వారీగా టాపర్లు
ఎన్టీఏ విడుదల చేసిన ఫలితాల ప్రకారం ఆయుర్వేద విభాగంలో వినోద్ 390 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. ఆయన పర్సంటైల్ 99.9972097గా నమోదైంది. హోమియోపతి విభాగంలో అయ్యమోలియా అక్షయ 417 మార్కులతో మొదటి స్థానంలో నిలిచారు. ఆమె పర్సంటైల్ 99.9906042గా ఉంది. సిద్ధ విభాగంలో అన్నైమరీ ఏ 319 మార్కులతో టాప్ ర్యాంక్ సాధించారు. ఆమె పర్సంటైల్ 99.8637602. యునానీ విభాగంలో అబ్దుల్ మొఘ్ని 359 మార్కులతో మొదటి స్థానంలో నిలిచారు. ఆయన పర్సంటైల్ 99.9622499గా నమోదైంది.
విభాగాల వారీగా కటాఫ్ మార్కులు
ఆయుర్వేదంలో జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50వ పర్సంటైల్ కటాఫ్‌గా నిర్ణయించారు. కనీస అర్హత మార్కులు 115గా ఉన్నాయి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40వ పర్సంటైల్ కటాఫ్ కాగా.. కనీస మార్కులు 97గా ఉన్నాయి. హోమియోపతిలో జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50వ పర్సంటైల్, కనీసం 136 మార్కులు అవసరమయ్యాయి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40వ పర్సంటైల్ కటాఫ్, కనీస మార్కులు 119గా ఉన్నాయి. సిద్ధ విభాగంలో జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50వ పర్సంటైల్ కటాఫ్, కనీస మార్కులు 135గా నిర్ణయించారు. ఓబీసీ, ఎస్సీ అభ్యర్థులకు 40వ పర్సంటైల్ కటాఫ్, కనీస మార్కులు 118గా ఉన్నాయి. యునానీలో జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50వ పర్సంటైల్ కటాఫ్, కనీస మార్కులు 151గా ఉన్నాయి. ఓబీసీ అభ్యర్థులకు 131, ఎస్సీకి 136, ఎస్టీకి 134 కనీస మార్కులుగా నమోదయ్యాయి.
ఫలితాల అనంతరం పీజీ సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే కౌన్సెలింగ్ నిర్వహణలో ఎన్టీఏకు ప్రత్యక్ష పాత్ర ఉండదని స్పష్టం చేసింది. ఆల్ ఇండియా కోటా సీట్లకు ఆయుష్ అడ్మిషన్స్ సెంట్రల్ కౌన్సెలింగ్ కమిటీ () కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. ప్రభుత్వ, ప్రభుత్వ సహాయక సంస్థలు, జాతీయ సంస్థలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లోని సంబంధిత సీట్లకు ఈ ప్రక్రియ వర్తిస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోటా సీట్లకు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నియమిత కౌన్సెలింగ్ సంస్థలు ప్రక్రియను నిర్వహిస్తాయి. అభ్యర్థుల ర్యాంకు, కోర్సు ప్రాధాన్యత, అర్హత, స్థానికత నిబంధనలు, రిజర్వేషన్ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని ప్రవేశాలు కల్పిస్తారు.











