తీసుకున్నట్లు
తాము బ్యాంకు అధికారులమని చెప్పి వినియోగదారులకు ఫోన్ చేసి, వారి ఖాతా, క్రెడిట్ కార్డు వివరాలు, వన్‌టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) సేకరించి నగదును కాజేస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడిని ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలో నిందితుడిని అదుపులోకి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు.
పోలీసుల దర్యాప్తులో తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో అతడిపై సుమారు 150 సైబర్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసుల్లో బాధితులు మొత్తంగా రూ.95.33 లక్షలకు పైగా నష్టపోయినట్లు పోలీసులు తెలిపారు.
ఆదిలాబాద్ బ్రాహ్మణవాడకు చెందిన ప్రఫుల్ పాటిల్‌కు గత జూలైలో బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో అతడిని నమ్మించి, కార్డు వివరాలతో పాటు ఓటీపీని సేకరించాడు. అనంతరం పలు లావాదేవీల ద్వారా బాధితుడి ఖాతా నుంచి రూ.73,279ను బదిలీ చేసుకున్నాడు. మోసాన్ని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కేసు దర్యాప్తులో భాగంగా సైబర్ నేరాలకు సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని పోలీసులు విశ్లేషించారు. జాతీయ సైబర్ నేరాల నివేదిక వ్యవస్థలో లభించిన వివరాలను పరిశీలించి నిందితుడి కదలికలను గుర్తించారు. చివరకు మహారాష్ట్రలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
విచారణ సందర్భంగా నిందితుడి గత వ్యవహారాలపై కూడా పోలీసులు ఆరా తీశారు. గతంలో యాక్సిస్ బ్యాంకులో పనిచేసిన అనుభవాన్ని ఉపయోగించుకుని బ్యాంకు ఖాతాదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించారు. బ్యాంకు కస్టమర్లతో మాట్లాడిన సమయంలో సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని వారికి ఫోన్ చేసి మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
క్రెడిట్ కార్డు యాక్టివేషన్, బ్యాంకు ఖాతాలో సమస్యలు ఉన్నాయని చెప్పడం, సేవలను కొనసాగించాలంటే వివరాలు ధ్రువీకరించాలంటూ బాధితులను నమ్మించడం వంటి పద్ధతులను నిందితుడు ఉపయోగించేవాడని పోలీసులు వెల్లడించారు. బాధితుల నుంచి కార్డు, ఖాతా వివరాలతో పాటు ఓటీపీ తెలుసుకున్న తర్వాత నగదును ఇతర ఖాతాలకు బదిలీ చేసేవాడని తెలిపారు. కొన్ని సందర్భాల్లో యూపీఐ, అమెజాన్ ఖాతాలను కూడా ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది.
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిందితుడు తరచూ సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు మార్చేవాడని పోలీసులు తెలిపారు. మోసాలకు ఉపయోగించిన ఒక మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేసినట్లు కూడా విచారణలో వెల్లడైనట్లు చెప్పారు.
ఈ కేసు దర్యాప్తులో డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐ సునీల్‌కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకు అధికారులు ఎప్పుడూ ఓటీపీ, పిన్, పాస్వర్డ్, కార్డు వివరాలను ఫోన్లో అడగరని తెలిపారు. అనుమానాస్పద కాల్స్ వస్తే ఎలాంటి వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలు వెల్లడించకుండా వెంటనే సంబంధిత బ్యాంకుకు సమాచారం ఇవ్వాలని సూచించారు.











