రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి బూత్ స్థాయిలో పనిచేసే బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) కీలక పాత్ర పోషించాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మణుగూరులో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బీఎల్ఏల శిక్షణా శిబిరంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న ప్రజా పోరాటాలు బూత్ స్థాయిలో విజయం సాధించినప్పుడే ఫలిస్తాయని అన్నారు. ప్రతి బీఎల్ఏ సైనికుడిలా పనిచేస్తూ దొంగ ఓట్లు, ప్రలోభ రాజకీయాలను ఎదుర్కొని పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
డీసీసీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పులు వంటి అంశాలను ఫారం-6, 7, 8ల ద్వారా వేగంగా పూర్తి చేయాలని తెలిపారు.
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, బీఎల్ఏలు కేవలం ఓటరు జాబితా పనులకే పరిమితం కాకుండా పార్టీకి, ప్రజలకు మధ్య వారధిలా వ్యవహరించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాలని కోరారు. ప్రతి బూత్ పరిధిలోని ఓటర్లతో నిరంతర సంబంధాలు కొనసాగిస్తూ యువతను ఓటరు జాబితాలో చేర్చే దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.








