కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, పాత 29 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేపట్టాయి. మణుగూరు ఏరియాలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని, తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కార్మికుల శ్రమను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే కొత్త లేబర్ కోడ్ లను తీసుకువచ్చిందని ఆరోపించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాసే ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
మణుగూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో, కార్మికులు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కు అందజేశారు. కొత్త లేబర్ కోడ్ లను రద్దు చేయకపోతే భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు తప్పవని నాయకులు హెచ్చరించారు.
ఈ సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా కూడా మద్దతు ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని, తమ సంఘీభావాన్ని తెలియజేశారు. కార్మిక సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం రాజీలేని పోరాటాలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయి.








