నిర్మల్: జిల్లాలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. నిర్మల్ జిల్లాలో మొత్తం రూ.23.35 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు సోమవారం శంకుస్థాపన చేశారు. జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి మంత్రులు శిలాఫలకాలను ఆవిష్కరించారు.
ఈ నిధులతో గోదావరి పుష్కరాలకు సంబంధించిన రహదారుల నిర్మాణం, రిజిస్ట్రార్ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణ పనులను చేపట్టనున్నారు. ఈ నిర్మాణాలు పూర్తయితే ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి.
అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రులు సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా నిర్మల్ చేరుకున్న మంత్రులకు, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎమ్మెల్సీ దండే విఠల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ పటేల్, ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఉట్నూర్ ఐటీడీఏ పీవో మంద మకరంద్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇటీవల నిర్మల్, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది జనవరిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్మల్‌లో పలు అభివృద్ధి ప్రణాళికలను ప్రకటించడంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రూ.386.46 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వ అధికారిక సమాచారం పేర్కొంది.











