ప్రముఖ బ్రిటిష్ రచయిత, మాజీ కన్జర్వేటివ్ ఎంపీ జెఫ్రీ ఆర్చర్ 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. సోమవారం తన ఇంట్లో రచనా పనుల్లో ఉండగానే ఆయన ప్రశాంతంగా తుదిశ్వాస విడిచినట్లు ప్రచురణ సంస్థ హార్పర్‌కాలిన్స్ వెల్లడించింది. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన తన రచనా ప్రస్థానంలో ఆర్చర్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పాఠకులను ఆకట్టుకున్నారు.
ఆయన రచనలు 119 దేశాల్లో ప్రచురితమై, 30 కోట్లకు పైగా ప్రతులు అమ్ముడైనట్లు సమాచారం. ఆర్చర్‌కు భారత్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ముఖ్యంగా కేన్ అండ్ ఏబెల్, ది క్లిఫ్టన్ క్రానికల్స్, ది ఫోర్త్ ఎస్టేట్ వంటి రచనలు భారతీయ పాఠకుల్లో విశేష ఆదరణ పొందాయి.
ఆయన పుస్తకాలు భారతీయ పుస్తక దుకాణాల్లో విస్తృతంగా కనిపించేవి. 2019 జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో ఆర్చర్‌ను వినేందుకు దాదాపు 8 వేల మంది హాజరయ్యారంటే భారత్‌లో ఆయనకున్న అభిమానాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఆర్చర్ పుస్తకాలకు భారత్‌లో ఉన్న డిమాండ్ ఎంతగా ఉండేదంటే.. కొన్ని సందర్భాల్లో బ్రిటన్ కంటే ముందుగానే ఆయన కొత్త పుస్తకాలు భారత్‌లో విడుదలయ్యేవి. పుస్తక పైరసీ కారణంగా తన రచనల నకిలీ ప్రతులు విడుదలైన కొద్ది రోజుల్లోనే భారత మార్కెట్లోకి వచ్చేవని ఆర్చర్ గతంలో వెల్లడించారు. దీంతో అధికారిక ప్రచురణకర్తలు భారత్‌లోనే పుస్తకాలను ముందుగా విడుదల చేసే వ్యూహాన్ని అనుసరించారు.
క్రికెట్ కూడా ఆర్చర్‌ను భారతీయులతో మరింత దగ్గర చేసింది. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే వంటి భారత క్రికెట్ ప్రముఖులతో ఆయనకు పరిచయాలు ఉండేవి. భారత్ ప్రజలను తన సహజ స్నేహితులుగా భావించేవారని ఆయన గతంలో పేర్కొన్నారు.
రచయితగా సాధించిన విజయాలతో పాటు ఆర్చర్ జీవితం రాజకీయాలు, వివాదాలతోనూ నిండిపోయింది. 1969లో 29 ఏళ్ల వయసులో ఎంపీగా ఎన్నికైన ఆయన రాజకీయ జీవితానికి 1974లో ముగింపు పలికారు. అనంతరం రచయితగా ఎదిగి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
అయితే 1987 నాటి పరువునష్టం కేసులో తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు అలీబీ వ్యవహారంలో దోషిగా తేలడంతో 2001లో నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. రెండేళ్లకు పైగా శిక్ష అనుభవించిన తర్వాత విడుదలయ్యారు.
ఆర్చర్ చివరి నవల ఆడమ్ అండ్ ఈవ్ ఆయన మరణానికి మరుసటి రోజు విడుదల కావాల్సి ఉంది. ఐదు దశాబ్దాల రచనా ప్రయాణానికి ఈ నవలతో ముగింపు పలకాలని ఆయన భావించారు.
సరళమైన ఇంగ్లిష్, వేగవంతమైన కథనం, ఉత్కంఠభరితమైన మలుపులు, బలమైన పాత్రలతో ఆయన నవలలు భారతదేశంలో ఇంగ్లిష్ పుస్తక పఠనానికి కొత్త తరాన్ని ఆకర్షించాయి. అందుకే జెఫ్రీ ఆర్చర్ కేవలం బ్రిటన్‌కు చెందిన బెస్ట్ సెల్లింగ్ రచయితగానే కాకుండా, భారతీయ పాఠకుల జ్ఞాపకాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన రచయితగా నిలిచిపోయారు.











